Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం ధ్వంసం చేసి, ఓటర్లను బెదిరించి కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈవీఎంను విరగొట్టిన కేసులో హైకోర్టులో ఊరట లభించిన ఇంకా ఆయన బయటకు రాలేదు. ఎన్నికల్లో ఏజెంట్లను నియమించుకోవడంతోపాటు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు హైకోర్టులో ఊరట పొందారు. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మాచర్ల వెళ్లొద్దని హైకోర్టు నిన్న రాత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నర్సరావుపేటలోనే ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన అజ్ఞాతంలో ఉన్నా బయటక ఉన్నా ఒకటే అన్న టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు మరికొన్ని కేసులు కూడా ఆయన్ని వెంటాడుతున్నాయి. 


పాల్వాయిగేటు పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాత్రమే పిన్నెల్లికి ఊరట లభించింది. అక్కడే ఉన్న ఓ ఏజెంట్‌ను, ఇంకో మహిళను బెదిరించిన కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. దీంతోపాటు మాచర్లలో ఓ పోలీసు అధికారిపై జరిగిన దాడి విషయంలో కూడా ఈయనపై కేసు ఉంది. ఈ నెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా టీడీపీ ఏజెంట్‌గా ఉన్న నంబూరి శేషగిరి రావు ఆయన్ని అడ్డుకున్నారు. అక్కడ తనను బెదిరించడమే కాకుండా చచ్చేలా కొట్టారని నంబూరి శేషగిరిరావు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేర‌కు 307 సెక్షన్‌ కింద పిన్నెల్లిపై కేసు నమోదు చేశామని రెంటచింతల పోలీసులు తెలిపారు. ఇందులో ఆయనకు ఎలాంటి ఊరట ఇంత వరకు రాలేదు. 


ఆ కేసులు కారణంగానే ఇంత వరకు ఎమ్మెల్యే బయటకు రావడం లేదనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే పిన్నెల్లిని పోలీసుల అధికారులు ఊరు దాటించారు, అజ్ఞాతంలో ఉండేలా సహకరిస్తున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఒక వేళ ఆయన బయటకు వచ్చి ఆ కేసులో అరెస్టు చేయకుంటే ఖాకీలపై మరిన్ని ఆరోపణలు రానున్నాయి. ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకే అన్నింటినీ చెక్‌ పెట్టేందుకు హైడ్‌ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


ఈ కేసుతోపాటు ఈవీఎం ధ్వంసం కేసులో కూడా మరికొన్ని వెసులుబాటుల కోసం పిన్నెల్లి లాయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈవిషయంలో క్లారిటీ వచ్చే వరకు ఆయన అజ్ఞాతంలోనే ఉంటారనే టాక్ నడుస్తోంది. మరోవైపు పిన్నెల్లికి కోర్టుల్లో ఊరట దొరికి మాచర్ల వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ పోలీసు వర్గాల్లో, స్థానికుల్లో జోరుగా సాగుతోంది. దీనిపై పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు. 


పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత పిన్నెల్లిని అడ్డుకోవడానికి వెళ్లిన వ్యక్తిపై దాడి చేసి హత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. అక్కడే ఓ మహిళపై కూడా నోరు పారేసుకున్నారనే ప్రచారం ఉంది. ఇంతలో పిన్నెల్లి సోదరులు వీరంగం సృష్టించారని తమను అడ్డుకున్న వారిపై దాడులు చేశారని సిట్ విచారణలో తేలింది. వీటన్నంటిపై కూడా కేసులు నమోదు అయ్యాయి. అప్పుడే పరిస్థితి అలా ఉంటే ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు బయటకు వస్తే పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. 


పిన్నెల్లికి ఊరట లభించి మాచరల్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. కౌంటింగ్ రోజున భద్రత పరిస్థితి ఏంటీ, ఘర్షణలకు కారణమయ్యే గ్రామాలు ఏంటీ అన్నింటినీ పరిశీలిస్తున్న పోలీసులు ఆ దిశగా పటిష్ట భద్రత చేపట్టేందుకు సిద్దమయ్యారు.