YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహరాల పై నేతలు ఫోకస్ పెట్టారు. అదే సమయంలో గెలుపు గుర్రాల ఎంపిక విషయంలో పార్టీ నాయకులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. జిల్లాల వారీగా పరిస్దితులను అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పర్యటనలు కూడా ప్రారంభించారు. బాపట్ల జిల్లాలో పరిస్దితులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు, స్దానికంగా ఉన్న శాసన సభ్యులు వారి పని తీరు పై విజయ సాయి రెడ్డి ప్రత్యేకంగా వాకబు చేశారు. రెండు రోజుల పాటు బాపట్ల జిల్లా పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఆమంచి తీరు పై నాయకులు విజయ సాయి రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇతర నియోజకవర్గల్లో జోక్యం వద్దని ఇప్పటికే ఆమంచి కి చెప్పామని నాయకులకు విజయ సాయి సర్ది చెప్పారు.
51 శాతం ఓట్లు వస్తాయన్న విజయసాయిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో రాష్ట్రంలో 87శాతం కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధి చేకూరిందని, ఫలితంగా రాష్ట్రంలో 51% పైచిలుకు ప్రజలు వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో 151 సీట్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని దక్షిణ కోస్తా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయి రెడ్డి చెబుతున్నారు. బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల, పర్చూరు, రేపల్లె, అద్దంకి,చీరాల,వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు జరిగాయి. క్షేత్రస్థాయిలో పార్టీ అత్యంత ప్రజాధరణతో పూర్తి బలంగా ఉందని విజయ సాయి అన్నారు.
బాపట్లలో అన్ని స్థానాలను గెల్చుకుంటామని ధీమా
బాపట్ల జిల్లా క్లిష్టమైన జిల్లా అని, గతంలో అద్దంకి, చీరాల, పర్చూరు, రేపల్లె పోగోట్టుకున్నామని అయితే ఇప్పుడు వేమూరు, బాపట్లతో పాటు గతంలో పోగొట్టుకున్న 4 నియోజకవర్గాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తామని అన్నారు. జిల్లా నేతలు, నియోజకవర్గ నేతలు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించిన తరువాత ఈ నమ్మకం మరింత బలపడిందని అన్నారు. ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా మొదటి విడతలో అన్ని జిల్లాల్లో పర్యటనలు, రెండవ విడతలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు విజయ సాయిరెడ్డి తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. జగనన్న సురక్ష కింద ప్రజల సమస్యలను పరిష్కరించామని అన్నారు. మూడవ విడతలో ప్రతి మండలంలోనూ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు లక్ష్యంతో వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని అన్నారు.
వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచనలు
నియోజకవర్గంలో అత్యంత కీలకంగా వాలంటీర్ల ను పార్టీ తరపున ఉపయోగించాలని విజయ సాయి రెడ్డి, పార్టి శ్రేణులకు పిలుపునిచ్చారు. మరలా అధికారం రావాలంటే వాలంటీర్ల ద్వారేనే కీలకంగా పనులు చేయించటం ద్వారా, ప్రతి ఇంటిని ఓటర్ ను టచ్ లోకి తీసుకోవటం సాధ్యం అవుతుందని, ఈ విషయంలో ర్టి నాయకులు విభేదాలు, అభిప్రాయ భేదాలను పక్కన పెట్టిన వచ్చే ఎన్నికలే టార్గెట్ గా కార్యకలాపాలు సాగించాలని ఆయన సూచించారు. పార్టీ కి వ్యతిరేకంగా, ఇంచార్జ్ , శాసన సభ్యుడిని కాదని నాయకులు, మందుకు వెళ్ళరాదని ఆయన స్పష్టం చేశారు.