పార్టీ విజయం కోసం పని చెయ్యండంటూ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి క్యాడర్ కు పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకాలాపాలను వేగవంతం చేసే క్రమంలో భాగంగా విజయసాయి రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనుబంధ సంఘాలతో వరుసగా సమావేశం అవుతున్నారు.


గత వారం రోజులుగా అనుబంధ సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు విజయసాయిరెడ్డి. పార్టీలో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేయాలని విజయ సూచిస్తున్నారు. పార్టీ సేవాదళ్, ఐటీ విభాగాల జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు సాయిరెడ్డి.


ఎమ్మెల్యేలతో సమన్వయం కీలకం...
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న సమావేశాల్లో పార్టీ క్యాడర్‌కు విజయ సాయి కీలక ఆదేశాలు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గ ఇంచార్జ్, లేదా శాసన సభ్యుడే సుప్రీం అంటూ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. దీని వల్ల పార్టీలో రెండో గ్రూపును ప్రోత్సహించేందుకు అవకాశం లేకుండా జాగ్రత్తలు పడగలమని అంటున్నారు. శాసన సభ్యులు, నియోజవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ సేవాదళ్, ఐటి విభాగాల జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన పాదయాత్రలో కలిసి నడిచిన వారికి, ప్రతిపక్షంలో సేవా దళ్ విభాగంలో పని చేసిన వారికి ప్రభుత్వం వచ్చాక తగిన గుర్తింపు లభించిందని అన్నారు. 2019లో పార్టీ విజయం కోసం పని చేసిన వారికి జగన్ సముచిత స్థానం కల్పించారని తెలిపారు.


భవిష్యత్‌పై భరోసా కల్పిస్తాం...
పార్టీ అనుబంధ సంఘాల సమావేశాల్లో పాల్గొంటున్న నేతలకు విజయ సాయి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో నాయకులుగా ఎదిగేందుకు పార్టీ మీకు మరిన్ని అవకాశాలు ఇస్తుందని చెబుతున్నారు. పార్టీలో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. అనుబంధ విభాగాల జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీలు పూర్తైన తర్వాత అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జీలు, జిల్లా అధ్యక్షులతో జగన్ సమావేశం అవుతారని తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు వచ్చినప్పుడు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జీలు, జిల్లా అధ్యక్షులకు సముచిత స్థానం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


పార్టీ కార్యకలాపాలపై ఫోకస్...
పార్టీ అనుబంధ సంఘాలకు ఇంచార్జ్‌గా ఉన్న విజయసాయి, కార్యకలాపాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గత వారం రోజులుగా ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉంటున్నారు. సొమవారం నుంచి శుక్రవారం వరకు పార్టీ కార్యకలాపాల పైనే ఎక్కువ ఆరా తీస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో ప్రతిపక్షాలన్నీ దాడి చేస్తున్న వేళ భవిష్యత్ రాజకీయాలను ఎలా అధిగమించాలి, రాబోయే రోజులు పరిణామాలను కార్యకర్తలకు, క్యాడర్‌కు వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి సైతం ప్రతికార్యకర్తకు అందుబాటులో ఉండే విధంగా పార్టీపరంగా ప్రత్యేకంగా ప్లాన్ వేస్తున్నారు. వీటన్నింటికన్నా ముందు పార్టీ అగ్రనాయకత్వం అనుబంధ సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు.