అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. 


సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణఆయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో 51,392 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ లబ్ధిదారులంతా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందినవారు. వీల్లకు ఒక్కొక్కరికి సెంటు స్థలాన్ని ఇంటి కోసం అందిస్తోంది ప్రభుత్వం. మొత్తం  25 లేఅవుట్లలో ప్లాట్లు కేటాయించింది. 


ఈ భూముల్లో ఎన్టీఆర్‌ జిల్లాకు 751.93 ఎకరాలు కేటాయించారు. అందులో 14 లే అవుట్లు వేసి 27వేల 532 మందికి ప్లాట్లు కేటాయించారు. గుంటూరు జిల్లాకు చెందిన 23,860 మందికి 650.65 ఎకరాలు కేటాయించి 11 లేఅవుట్లు వేశారు. అన్నింటికీ హద్దు రాళ్లు వేసి పొజిషన్‌ ఇచ్చారు. వీటి కోసం రోడ్లు కూడా నిర్మించారు. 


ఇదే వేదికపై నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో కట్టించిన టిడ్కో ఇళ్లు కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. పేదల కోసం 5,024 ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. 


వివాదాల ఆర్‌-5 జోన్


ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ఆర్‌ -5 జోన్‌ మొదటి నుంచి వివాదల సుడిలో ఉంది. అధికారులు అహరహం పనులు చేపడుతుంటే మరోవైపు రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. రైతులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నిర్దేశించిన ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయటం విరుద్ధమని రైతులు అంటున్నారు. ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామని అంటున్నారు. ముఖ్య మంత్రి పర్యటన ముగిసేంత వరకు అమరావతిలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. 


ఇక్కడ ఇళ్ల పట్టాల పంపిణీకి సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేయటంతో ప్రభుత్వం నివేశన స్థలాల వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్‌-5 జోన్‌ పరిధిలోని 25 లేఅవుట్లలో మెరక, అంతర్గత రహదార్ల పనులను రాత్రిళ్లు సైతం నిర్వహించారు. సీఆర్‌డీఏ అధికారులు ఇక్కడే మకాం వేసి పనులు చేయించారు. 


ఇవి చెల్లవని వాదిస్తున్న ప్రతిపక్షాలు
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం యాజమాన్య హక్కులు లేని పత్రాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. కోర్టు కేసుల్లో ఉంటే ఇళ్లు కట్టుకోవడానికి ఎలా అనుమతిస్తారని.. ఇప్పుడు యాజమాన్య హక్కులు లేని పట్టాలను ఇవ్వడం వల్ల పేదలకు కూడా పెద్దగా మేలు జరగదని విపక్షాలు అంటున్నాయి.  పేదలకు ఇచ్చే స్థలాల్లో లక్షలు పోగు చేసుకుని అక్కడ వారు ఇళ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఇళ్లు కట్టుకున్న తర్వాత కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారి సొమ్ము మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుందని వారి వాదన. 


అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్ని సెంటు స్థలాలుగా ఇచ్చేసిన వెంటనే  అక్కడ ఇళ్లు కూడా కట్టాలని అనుకుంటున్నారు.   కానీ ఇళ్లు కట్టాలంటే నిధులు కావాలి.  అందుకే ఆర్ 5 జోన్ లో యాభై వేల ఇళ్లు కట్టేందుకు ప్రతిపాదనలు పంపారు.  ఇప్పటి వరకూ కేంద్రం ేపీకి ఇరవై లక్షల ఇళ్లు మంజూరు చేసింది కేంద్రానికి మాత్రం మరో యాభై వేల ఇళ్లకు ప్రతిపాదనలు పంపారు. అదీ కూడా ఆర్5 జోన్‌లో . సెంటు స్థలాలను అమరావతి రైతులు ఇచ్చిన భూములను ఇచ్చినప్పటికీ ఇళ్లు మాత్రం కేంద్ర నిధులతో నిర్మిస్తారు. కేంద్రం ఒక్కో ఇంటికి రూ. 1 లక్ష 80 వేలు ఇస్తుంది. అలాగే ప్రభుత్వం లబ్దిదారులకు పావలా వడ్డ కింద మరో రూ. 35వేలు ఇప్పిస్తోంది. ఈ మొత్తంతో ఇళ్లు నిర్మించాలని అనుకుంటున్నారు. అయితే ముందుగా వీటికి కేంద్రం మంజూరు చేయాల్సి ఉంటంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూములు వివాదంలో ఉన్నందున వాటిలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది.