జంగారెడ్డి గూడెం ఘటనపై తెలుగుదేశం పోరు ఇంకా సాగుతూనే ఉంది. మూడు రోజులుగా శాసనసభలో మూడు రోజులుగా ఇదే అంశంపై ఆందోళన చేస్తూ సస్పెండ్ అవుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే చర్చ పెట్టమంటే ప్రభుత్వం పారిపోతుందని ఘాటుగా విమర్శిస్తోంది తెలుగుదేశం. 


శాసనసభలో ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపట్టారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. టీడీపీని చూస్తేనే జగన్ మోహన్ రెడ్డి భయపడిపోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అంటూ ఆ పార్టీ లీడర్లు చేస్తున్న ప్రచారం ఉత్తిదేనన్నారు. జగన్ ఫైర్‌ కాదు ఫ్లవర్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. 


కల్తీసారా మరణాలపై నిలదీస్తే వరుసగా మూడో రోజూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, లీడర్లు తప్పుబడుతున్నారు.కల్తీసారా తయారీలో వైసీపీ నేతల పాత్ర ఉన్నందుకే సభలో సీఎం తప్పుడు ప్రకటనలు చేశారన్నారు.జంగారెడ్డి గూడెంలో కల్తీసారా లేదని సీఎం చెప్తే, ఉందని ఆర్డీవో, ఎస్సీబీ, పోలీసులు నిరూపించారన్నారు. 27మంది అమాయకుల చావుకు ముఖ్యమంత్రే కారణమని ఆరోపించారు అనగాని సత్యప్రసాద్.కల్తీసారా పై నమోదైన ఎఫ్ఐఆర్‌లపై సీఎం ఏం సమాధానం చెప్తారో అని నిలదీశారాయన. 


27 మంది కల్తీసారాతో చనిపోతే...సహజ మరణాలంటూ సీఎం అతివినయం ప్రదర్శించారని ఎద్దేవా చేశారు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.  సభలో సీఎం అసత్యాలు చెప్పినందుకు ఆయనపై సభాహక్కుల నోటీసు ఇచ్చామన్నారు. అబద్దాలు చెప్పిన సీఎంపై  స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు. 


కల్తీసారాపై సమాధానం చెప్పలేకే భయపడి టీడీపీ సభ్యులను రోజూ సస్పెండ్ చేస్తున్నారన్నారు మరో ఎమ్మెల్యే మంతెన రామరాజు. అధికారికంగా నాటుసారా కేసులు నమోదవుతున్నట్టు సాక్ష్యాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఎలా అసత్యాలు చెప్తున్నారో అర్థం కావడం లేదన్నారాయన.మత్తు కోసం వివిధ రసాయినాలు నాటుసారాలో వాడటం వల్లే అవయువాలు త్వరగా దెబ్బతిని చనిపోతున్నారన్నారు. 


అసెంబ్లీ గౌరవ సభలా కాకుండా కౌరవ సభలా మార్చేశారని ఇది మరోసారి రుజువైందన్నారు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతున్నా సభను తప్పుదోవ పట్టించిన సీఎంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆ దిశగా స్పీకర్ ఎందుకు ఆలోచించడం లేదని నిలదీశారు. 


ఆడబిడ్డలకు న్యాయం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్... వారి పుస్తెలు తెంపుతున్నారన్నారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. గన్ కంటే ముందు వస్తానన్న జగన్ గత 3ఏళ్లలో ఏ ఒక్క మహిళకు న్యాయం చేయలేదన్నారు. తమ అవినీతి బయటపడుతుందనే సభలో కాల్తీ సారా అంశం చర్చకు రాకుండా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారన్నారు.


శాసన మండలిలో కూడా జంగారెడ్డి గూడెం ఘటన దుమారం రేపింది. ఛైర్మన్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. కల్తీసారా మరణాలను.. సహజ మరణాలుగా ప్రభుత్వం చిత్రీకరిస్తోందంటూ నినాదాలు చేశారు. జంగారెడ్డి గూడెం వరుస మరణాలపై చర్చ జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. 
టీడీపీ సభ్యుల తీరును వైసీపీ సభ్యులు తప్పుపట్టారు. ఈ గందరగోళం మధ్యనే ఛైర్మన్ మోషేను రాజు సభను వాయిదా వేశారు. 


అంతకు ముందు టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.