TDP Leaders Protest at AP Women Commission Office: విజయవాడలోని ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని  పరామర్శించే సమయంలో ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు, టీడీపీ అధినేత చంద్రబాబు, బొండా ఉమామహేశ్వరరావులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో తనను అభ్యంతరకర పదజాలంతో దూషించారంటూ చంద్రబాబు, బొండా ఉమకు వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. నేడు మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలంటూ నోటీసులలో పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం కోర్టు హాలులో చంద్రబాబు, బొండా ఉమ హాజరు నేపథ్యంలో కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మహిళా కమిషన్ సభ్యులు, సిబ్బంది ఎదురుచూశారు. కానీ చంద్రబాబు, బొండా ఉమ ఏపీ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకాలేదు.


మహిళా కమిషన్ ఆఫీసు ముట్టడికి యత్నం.. 
బుధవారం ఉదయం మహిళా కమిషన్ ఆఫీసుకు తెలుగు మహిళలు, టీడీపీ మహిళా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆధ్వర్యంలో మహిళా కమిషన్ వద్దకు చేరుకున్న తెలుగు మహిళలు, టీడీపీ మహిళా కార్యకర్తలు ఆఫీసులోకి చొచ్చుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తతలకు దారి తీసింది. నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్ కు లేదని టీడీపీ నేతలు అన్నారు. విజయవాడ జీజీహెచ్‌లో అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులు సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. 


విచారణకు హాజరుకాని చంద్రబాబు, బొండా
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసుల ప్రకారం నేడు కమిషన్ ఎదుట చంద్రబాబు, బొండా ఉమ హాజరుకావాలి. అయితే వీరిద్దరూ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకాలేదు. తాను విచారణకు హాజరు కావడం లేదని బొండా ఉమ స్పష్టం చేశారు. అయితే తెలుగు మహిళలు ఒక్కసారిగా భారీ సంఖ్యలో గుంటూరు జిల్లాలోని మంగళగిరిలోని మహిళా కమిషన్ ఆఫీసుకు తరలిరావడంతో ఉద్రికత్త నెలకొంది. ఏపీలో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన దాడుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని వంగ‌ల‌పూడి అనిత ప్రశ్నించారు. ఆమె ఆధ్వర్యంలో తెలుగు మహిళలు రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీస్‌ను ముట్టడించారు. అంతటితో ఆగకుండా ఆఫీసు లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. తెలుగు మహిళలు ఆఫీసును ముట్టడిస్తారని భావించి ముందు జాగ్రత్తగా 100 మంది పోలీసుల‌తో అధికారులు భ‌ద్ర‌త క‌ల్పించారు.


Also Read: Vijayawada Crime : పోలీసులు మరింత త్వరగా రియాక్ట్ అయితే ఘోరం జరిగేదికాదు, విజయవాడ ఘటనపై సీపీ వివరణ


Also Read: Vijayawada GGH Incident : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు అత్యాచారం!