ఏపీలో జగన్ పాలన, తెలంగాణలో కేసీఆర్ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పాలనతో ఏపీ పేపర్లలో నిత్యం అఘాయిత్యాలు, కబ్జాలు, దాడుల వార్తలు కనిపిస్తుంటే.. తెలంగాణ పేపర్లలో నిత్యం పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమ వార్తలే కనిపిస్తున్నాయంటూ ఏపీలో పాలనపై సెటైర్లు వేశారు. సీఎం జగన్  కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. రావెలలో అమరావతి ఆక్రందన పేరుతో రాజధాని రైతులతో లోకేష్ ముఖాముఖీ నిర్వహించారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


హైదరాబాద్‌లో ఇటీవల కోకాపేటలో ఒక ఎకరం భూమి రూ.100 కోట్లు పలికిందని, అయితే అందుకు కులం కారణం కాదన్నారు. కానీ గతంలో అమరావతిలో భూముల ధర పెరిగితే ఒక కులం వాళ్ల కోసం భూముల ధరలు పెంచారని జగన్ చేసిన వ్యాఖ్యలకు లోకేష్ ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో వంద కోట్లకు ఎకరం కులం పెంచిందా? కర్ణాటకకు ఫాక్స్‌కాన్‌ సంస్థను మతం తీసుకెళ్లిందా? అని ప్రశ్నించారు. అభివృద్ధి జరిగితే భూముల ధరలకు రెక్కలు వస్తాయన్నారు. కన్నతల్లిని, సోదరిని మోసం చేసిన సీఎం ప్రజలకు మాత్రం న్యాయం చేస్తారని ప్రజలు భావించడం లేదన్నారు.  ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఏటా 3 పంటలు పండే భూమిని అమరావతి రైతులు త్యాగం చేశారు. 5 కోట్ల ఆంధ్రుల కోసం భూములు త్యాగం చేశారని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వ్ జోన్ రద్దు చేస్తాం, మళ్లీ జీవో 41 అమలుచేసే బాధ్యత మేం తీసుకుంటాం అన్నారు. 


అమరావతిలో జగన్ ఆపేసిన పనులను మేం ప్రారంభిస్తామని, అభివృద్ధి వికేంద్రీకరణను చేసి చూపించిన వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పరిశ్రమలు తెచ్చామన్నారు. గోదావరి జిల్లాలకు ఆక్వా పరిశ్రమలు, విశాఖ జిల్లాకు అదానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు లోకేష్. అయితే ప్రజలు ఎన్నికల ముందు అమరావతికి జగన్ జై కొట్టారు కానీ ఎన్నికల తర్వాత మాట తప్పారు.. మడమ తిప్పారు అన్నారు. దక్షిణాఫ్రికా అంటూ ఇక్కడ మూడు ముక్కలాట ఆడుతున్నారని, అమరావతి రైతులను అన్ని రకాలుగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.



ఏపీలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. 3 రాజధానులు అంటున్నారు.. ఎక్కడైనా ఒక్క ఇటుక వేశారా.. ఇప్పుడు విశాఖ ప్రజలను కూడా జగన్ మోసం చేస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు.  హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నామని సీజేను ఎప్పుడైనా అడిగారా? జగన్ మాటలకు అందరూ మోసపోయారని చెప్పారు. వెయ్యి మంది అమరావతి రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తుందని.. అమరావతి ఉద్యమం వల్లే తొలిసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లామని గుర్తుచేసుకున్నారు లోకేష్. అమరావతి రైతులు మరో 9 నెలలు ఓపిక పట్టాలని, మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు.


చంద్రబాబు, లోకేష్ ఉన్నారని ధైర్యంగా ఉన్నాను..
గతంలో తనను రాజధాని ఎమ్మెల్యే అనేవాళ్ళని, ఇప్పుడు రాజధాని లేని ఎమ్మెల్యే అంటున్నారని ఉండవల్లి శ్రీదేవి అన్నారు. వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచిన కారణంగా ప్రభుత్వానికి ఎదురుతిరగలేదన్నారు. ఇప్పుడు తన వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని.. వారిచ్చిన ధైర్యంతో పోరాటం చేస్తానన్నారు. ఎలా తిరుగుతావో చూస్తామని వైసీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారని, అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడంతో కొండంత బలం వచ్చినట్లయిందన్నారు. ఏకైక రాజధాని అమరావతితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు.