కరోనా కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ రంగం... ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా మరింత నష్టాల్లో ఉందని ఆరోపించారు టీడీపీ లీడర్ నారా లోకేష్‌. ముందస్తు ప్రణాళిక లేకుండా, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం లేకుండా తీసుకున్న జగన్‌ తీసుకున్న నిర్ణయం కారణంగా 7 లక్షల మంది భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లెటర్ రాశారు. 


రాష్ట్రంలో ఫ్లెక్సీ రంగంలో ఎన్ని యూనిట్లు ఉన్నాయని... ఎంత మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. నిషేధం విధిస్తే తలెత్తే పరిణామాలేంటి... పరిశ్రమపై ఆధారపడిన వారికి కలిగే నష్టం ఎంత... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటన్న కసరత్తు చెయ్యలేదని ఆరోపించారు. జగన్‌ తీసుకున్న నిర్ణయం ప్రకటించిన లోపే... ఆ పరిశ్రమపై ఆధారపడిన వారితో చర్చలు జరపకుండా జి.ఓ. నెం 65 ఎలా తీసుకొచ్చారని నిలదీశారు. 


కఠిన ఆంక్షలు, ఫైన్లు విధిస్తూ నవంబర్ 1 నుంచే నిషేధాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ రంగాన్ని నమ్ముకున్న లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జీవనోపాధి కోల్పోతున్నామంటూ ఆవేదనతో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్లను, మంత్రులను, శాసనసభ్యులను కలిసి సమస్యను వివరించినా ఎటువంటి ఫలితం లేదు. ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకుందాం అనుకుంటే కనీసం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉందంటున్న వారి ఆవేదన క‌ల‌చివేసిందన్నారు. 


పర్యావరణంపై మీరు ప్రేమ ఒలకబోయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందని ఎద్దేవా చేశారు లోకేష్‌. ఒక పక్క మీరు ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీసున్నారని ఆరోపించారు. విశాఖలో పచ్చని రుషి కొండని బోడికొండగా మార్చారు వైసిపి నేతలు. ఫ్లెక్సీ పరిశ్రమపై నిషేధం విధించేందుకు చూపించిన వేగం వైసిపి కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాని అరికట్టడంలో చూపిస్తే పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుంది సూచించారు.


రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 1500 ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్లు ఉన్నాయని. వీరంతా సుమారుగా 10 నుంచి 30 లక్షల రూపాయిలు పెట్టుబడి పెట్టారని వివరించారు లోకేష్‌. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని కొంతమంది... అప్పులు చేసి కొంతమంది ఈ యూనిట్లను నెలకొల్పారని గుర్తు చేశారు. నెలవారీ ఈఎంఐ కట్టడమే కష్టం అవుతున్న సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం వీరిని కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. 


ప్రస్తుతం ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ ఎదుర్కుంటున్న తీవ్ర సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం వారి సమస్యలు అధ్యయనం చేసేందుకు... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సూచించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కమిటీ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.  ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమపై ఆధారపడిన వారు కోరుతున్న విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపై అధ్యయనం చెయ్యాలన్నారు. ప్రస్తుతం ఉన్న యూనిట్లను కాటన్ ఫ్లెక్సీ యూనిట్లుగా మార్చుకోవడానికి సుమారుగా 15 లక్షల రూపాయిల ఖర్చు అవుతుంది. ఈ మార్పు కోసం ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించాలన్నారు. నవంబర్ 1 నుంచి ప్రభుత్వం అమలు చెయ్యాలి అనుకుంటున్న నిషేధాన్ని కనీసం ఏడాదిపాటు వాయిదా వేసి ప్రస్తుతం ఉన్న యంత్రాలను అప్ గ్రేడ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలి హితవు పలికారు. హడావిడి నిర్ణయం, చర్యలతో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమపై ఆధారపడిన లక్షల మంది జీవితాలను అంధకారం చెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నట్టు లోకేష్ ఆ లేఖ‌లో పేర్కొన్నారు.