Buddha Venkanna: వైఎస్ఆర్ సీపీలో ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్‌కు సంబంధించిన క్లిప్ బాగా వైరల్ అవుతున్న వేళ, విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ అంశంపై స్పందిస్తూ వైఎస్ఆర్ సీపీకి కొత్త అర్థాన్ని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ పేరును ‘యువజన శృంగార రసిక చిలిపి పార్టీ’ అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. అంతేకాక, గతంలో వెలుగులోకి వచ్చిన నేతల రాసలీల ఆడియో టేపుల వివరాలను కూడా ప్రస్తావించారు.


అవంతి అరగంట సరసం, అంబటి గంట విహారం ఆడియోలు బయటకొచ్చాయని, వారిపై జగన్మోహన్ రెడ్డి ఏం చర్యలూ తీసుకోలేదని.. ఇలాంటివి చేస్తేనే అధినేత గుర్తిస్తున్నారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ కూడా న్యూడ్‌ వీడియోను అందుకే బయటకు వదిలారంటూ ఎగతాళి చేశారు. పార్టీ పేరును ఎంపీ గోరంట్ల మాధవ్‌ సార్థకం చేస్తున్నాడని సెటైర్లు వేశారు. పార్టీలో గోరంట్ల మాధవ్‌ మరో ట్రెండ్‌ సెట్టర్‌ అని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆశీస్సులతో ఇప్పటివరకు అవంతి అరగంట సరసం, అంబటి గంట విరహం ఆడియోలు బయటికొచ్చినా వారిపై జగన్‌ ఏ చర్యలూ తీసుకోలేదని బుద్ధా విమర్శించారు. ఇప్పుడు ఎంపీపై చర్యలు తీసుకుంటారో, అంబటిలా పదవి ఇచ్చి గౌరవిస్తారో చూద్దాం అంటూ బుద్ధా వెంకన్న ట్విట్టర్‌ లో స్పందించారు.


దేశమంతా అజాదీకా.. వేడుకలు, ఇక్కడేమో అశ్లీలం - సోమిరెడ్డి
దేశంలో ఒకవైపు అజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు, మరోవైపు జెండా పండగలు జరుగుతున్నాయని.. ఏపీలో మాత్రం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న ప్రదర్శనలు చూడాల్సి వస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పందించారు. రేప్ కేసుల్లో ముద్దాయిలైన వ్యక్తులకు అవార్డులు, రివార్డులు ఇవ్వడం సీఎం జగన్ కి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కియా కంపెనీ ప్రతినిధులతో నీచంగా ప్రవర్తించినప్పుడే ఇలాంటి దుర్మార్గులను ఇంటికి పంపి ఉండాల్సిందని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల ప్రవర్తన, వాడుతున్న భాష చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితుల్ని ప్రజలకు తెచ్చారన్నారు. ఒకప్పుడు అభివృద్ధికి రోల్ మోడల్ గా నిలిచిన ఏపీ, ఇప్పుడు వైసీపీ నేతల దుర్మార్గాలు, దోపిడీలకు కేరాఫ్ గా మారిందని అన్నారు. 


ఎంపీ మాధవ్‌ వ్యవహారంపై సోషల్‌ మీడియాలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఫైర్ అయ్యారు. హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని నాన్చి నాన్చి సస్పెండ్ చేస్తున్నాం అని చేతులు దులుపుకున్నారని.. ఇప్పుడు అసభ్య వీడియోలో అడ్డంగా దొరికిన ఎంపీపై ఇంకా ఏ చర్యా లేదని నిలదీశారు. తక్షణమే అతడితో మహిళలకు క్షమాపణ చెప్పించి పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.


‘ఆంబోతులపై చర్యలు తీసుకోరా’ - అయ్యన్న
ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న వారిపై సీఎం జగన్ క‌నీస చ‌ర్యలు తీసుకోవ‌డం లేదని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మ‌హిళ‌లపై లైంగిక‌ దాడుల‌కి పాల్పడిన‌ వారికి మంత్రి ప‌ద‌వులు క‌ట్టబెడుతున్నారని,  వైకామ‌కేయుల్ని ఊరి మీదకి వ‌దిలి దిక్కులేని దిశ‌ చ‌ట్టం తెచ్చారని మండిపడ్డారు.