Ramoji Rao: రామోజీరావు తెలుగు వెలుగు- ఆయన మృతి తీరని లోటు: చంద్రబాబు నాయుడు

Chandra Babu: రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు దేశానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. తెలుగు వారి జీవితాల్లో ప్రభావవంతమైన ముద్రవేసిన ఆయన లేని లోటు తీర్చలేమన్నారు.

Continues below advertisement

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు అన్నారు. 

Continues below advertisement

తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని....ఆయన మరణం రాష్ట్రానికే కాదు...దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని చంద్రబాబు అన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకం అని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి...ఎక్కడా తలవంచకుండా రామోజీ గారు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని అన్నారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రామోజీరావుతో తనుకు ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు... తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని అన్నారు. సమస్యలపై పోరాటంలో ఆయన తను ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని గుర్తుచేసుకున్నారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.

అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళి: లోకేష్ 

జీవితాంతం నిబద్దతతో పని చేసిన రామోజీరావు మనందరికీ మార్గదర్శి అన్నారు నారా లోకేష్. ఆయన మృతి తెలుగు సమాజానికి తీరని లోటుగా అభివర్ణించారు. "రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు. "

Continues below advertisement