తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం విషయాల్లో రాజీ పడేది లేదన్నారు చంద్రబాబు. పార్టీ రాష్ట్రస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యత్వ నమోదు పూర్తి చెయ్యాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి వరకు కమిటీలు నియమించాలన్నారు. ఓటర్ల వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. లేకపోతే టీడీపీ వాళ్ల ఓట్లు ఉండవని హెచ్చరించారు. ప్రజల్లో ఎంత చైతన్యం ఉన్నా ఓట్లు లేకపోతే ఏమీ చెయ్యలేమన్నారు. జాగ్రత్తగా ఉండాలని.... గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయంలో పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు.
బాధ్యత గుర్తు చేద్దాం
రాష్ట్రంలో ఇంత అరాచకం ఉంటే కొన్ని టీవీలు తిరిగి టీడీపీనే విమర్శిస్తున్నాయని ఆశ్చర్య వ్యక్తం చేశారు చంద్రబాబు. వాటిని దూరంగా పెట్టాలని పిలుపునిచ్చారు. వారికి బాధ్యత గుర్తు చెయ్యాలన్నారు. నేతలు సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకోవాలన్నారు. విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే మరింత ఎక్కువ నష్టమని అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు ఇంటి నుంచి బయటకు వస్తే చాలు కేసులు పెడుతున్నారని... జగన్ కు నిద్రలో కూడా టిడిపి నేతలే గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు లేకుండా వైసిపి వాళ్లు వస్తే ఒక్క నిముషంలో వారి పని తేలిపోతుందన్నారు.
ఇంట్లో కూర్చుంటే ఎప్పటికీ ఇంట్లోనే
వీటన్నింటినీ టీడీపీ నేతలు సవాల్‌గా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. నేతలు తమ సౌకర్యం కోసం ఇంట్లో పడుకుంటే ఎన్నికల అనంతరం కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసులు, దాడులపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతామని... ఎవరిని వదలబోమన్నారు. ఇప్పటికీ తనపై కేసులు పెట్టేందుకు వెతుకుతున్నారని... పార్టీ పెద్దల పేర్లు చెప్పమని కేసులు పెట్టి బాధితులను ఒత్తిడి చేస్తున్నాన్నారు. జగన్ అక్రమాలకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అవినీతి బురద అందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ముందస్తుకు వెళ్తే దరిద్రం త్వరగా పోతుంది
ఎన్నికలకు 18 నెలల సమయం ఉందన్న చంద్రబాబు... జగన్ ఇంకా ముందు ఎన్నికలకు వెళ్తే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందన్నారు. ఇప్పుడు ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడడం లేదని... పార్టీలో కూడా ఈ విషయంలో క్లారిటీ ఉండాలన్నారు. ముందు రాష్ట్రాన్ని కాపాడాలి...దానికి అందరూ కలిసి రావాలన్నారు. మేథావులు, ఉద్యోగులు సహా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇంచార్జ్ 10 రోజులు నియోజకవర్గంలో ఉండాలని... నియోజకవర్గ అబ్జర్వర్ 8 రోజులు నియోజకవర్గంలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా ఉంటారని ప్రకటించారు. వారిని గెలిపించే బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో తెలుగు దేశం అధికారంలోకి వస్తేనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతుందన్నారు చంద్రబాబు. అప్పట్లో ఎక్కువ సమయం పార్టీపై పెట్టలేదు కాబట్టి సమస్యలు వచ్చాయని తెలిపారు. పార్టీపై దృష్టి పెట్టిన సందర్భంలో ఓటమి లేదన్నారు. పాలనలో పడిపోయినప్పుడే సమస్యలు వచ్చాయని గుర్తు చేశారు. నన్ను సరి చేసుకుంటున్నాను అని చంద్రబాబు కామెంట్ చేశారు.