TDP candidate Gottipati Lakshmi- దర్శి: ఎన్నికల్లో ప్రచారం చేయడం మాత్రమే కాదు, అవసరమైతే పురుడు సైతం పోసి ప్రాణాల్ని కాపాడతా అంటున్నారు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. ఈ కుమంలో కురిచేడు మండలం అబ్బాయి పాలెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళకు సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. రాజకీయాల్లోకి వచ్చినా డాక్టర్ గా ప్రజల ప్రాణాలు కాపాడితే చాలా సంతోషంగా ఉంటుందన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో అంతా హర్షం వ్యక్తం చేశారు.
దర్శి లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్లు లేకపోవడంతో..
అబ్బాయి పాలెం గ్రామానికి చెందిన వెంకటరమణి పురిటి నొప్పులతో బాధపడుతోంది. కుటుంబసభ్యులు ఆమెను దర్శి లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో, స్థానికులు వెంటనే దర్శి టీడీపీ అభ్యర్థి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి సమాచారం అందించారు. ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్న సమయంలో విషయం తెలియగానే దర్శిలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. పేషెంట్ ను పరీక్షించారు. నార్మల్ డెలివరీ కాక తీవ్ర నొప్పులతో బాధపడుతున్న మహిళకు సిజేరియన్ చేశారు గొట్టిపాటి లక్ష్మి. గర్భిణీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సమయానికి వచ్చి దేవతలా తల్లి, బిడ్డను కాపాడారంటూ కుటుంబసభ్యులు టీడీపీ దర్శి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని కొనియాడారు. గర్బిణీ తరఫున ఆమె కుటుంబసభ్యులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీ మహిళా అభ్యర్థి లక్ష్మీ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం కన్నా ఓ ప్రాణాన్ని కాపాడటమే తనకు ముఖ్యమన్నారు. ఎన్నికల ప్రచారం లాంటి కీలక సమయంలో తల్లీబిడ్డను కాపాడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి సేవలు అందిస్తామని చెప్పారు.