అమరావతి: దేశ వ్యాప్తంగా మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం తెలిసిందే. ఇక అది మొదలుకుని ఏపీలో ఎన్నికల అధికారులు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. నేతల వాహనాలతో పాటు అనుమానం ఉన్న చోట తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఉండవల్లి కరకట్ట వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపారు పోలీసులు. లోకేష్ వాహనాలను తనిఖీ చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటికి మూడుసార్లు లోకేష్ వాహనాలను ఆపి పోలీసులు చెక్ చేశారు.


తాడేపల్లి టౌన్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి పోలీసులు చెప్పారు. కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీ చేపట్టిన పోలీసులకు లోకేష్ పూర్తిగా సహకరించారు. నారా లోకేష్ కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసుల తెలిపారు. 


నాలుగు రోజుల కింద తొలిసారి..
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో నాలుగు రోజుల కిందట లోకేష్ వాహనాలను తొలిసారి తనిఖీ చేశారు పోలీసులు. తాడేపల్లి అపార్ట్ మెంట్ వాసులతో ముఖాముఖీ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు లోకేష్ కాన్వాయ్ ని ఆపి, అన్ని వాహనాలను తనిఖీలు నిర్వహించారు. శనివారం రెండోసారి లోకేష్ వాహనాలను ఆపి పోలీసులు తనిఖీ చేయగా టీడీపీ నేత పూర్తిగా సహకరించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన లోకేష్.. ఓడిన చోటే నెగ్గాలని మరోసారి అదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లి పోలీసులు తనిఖీ చేస్తున్నారని, వైసీపీ మంత్రుల, నేతలు మాత్రం ఓటర్లకు నగదు, మద్యం, చీరలు పంపిణీ చేస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు పర్యటనలో ఎన్ని తనిఖీలు చేస్తారో మేం చూస్తామంటున్నారు. ఏపీకి ఏప్రిల్ 18 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్లు లెక్కించి విజేతల్ని ప్రకటించనున్నామని షెడ్యూల్ విడుదల సమయలో సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.