రాజధాని అంశంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వికేంద్రీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు మంత్రులు. సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని అమరావతి అంశం పై విచారణ జరిగింది. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యమని చెప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆరు నెలల కాలవ్యవధి లోపల రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించింది సుప్రీంకోర్టు. హై కోర్టు ఇచ్చిన తీర్పులోని 3 నుంచి ఏడు ఆదేశాలపై స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు విచారణ జనవరి 31కి వాయిదా వేసింది ధర్మాసనం. ఇలాంటి అంశాలలో నైపుణ్యం లేకుండా ఇలాంటి ఆదేశిలిస్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు సమాచారం. రెండు నెలలలో నిర్మాణం చేయమంటారా అని ప్రశ్నించింది. కోర్టులు ఎప్పటికీ ప్రభుత్వాలు కాదు. అలాంటి ఆదేశాలు ఇవ్వొచ్చా? అని సుప్రీం వ్యాఖ్యానించింది.
మంత్రుల స్పందన...
సుప్రీంకోర్టు వ్యాఖ్యలుపై ఏపీ మంత్రులు స్పందించారు. చంద్రబాబు బినామీ రైతులను సృష్టించారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అడ్డగోలుగా కొట్టేసిన భూముల్ని కాపాడే ప్రయత్నం బాబు చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం ఒక్కో అడ్డంకి తొలగిస్తోందని... సుప్రీంకోర్టు కొన్ని అంశాలపై స్టే ఇచ్చిందిన్నారు మంత్రి కాకాణి. అన్ని అడ్డంకులు తొలగిస్తామన్నారు.
అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు మంత్రి అంబటి రాంబాబు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వికేంద్రీకరణకు బలాన్నిస్తున్నాయని తెలిపారు. రాజధానిని 3 నెలలు లేదా 6 నెలల్లోనే నిర్మించాల్సిన అవసరం లేదని అంబటి స్పష్టం చేశారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీన్ని బట్టి అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. ఇక అమరావతి యాత్రకు శాశ్వత విరామం ఇచ్చినట్టేనని పేర్కొన్నారు. గ్రాఫిక్స్ చూపించారు తప్ప అమరావతిలో నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. రైతుల వేషాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా రాజధానులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను చంద్రబాబు ఆపాలన్నారు అంబటి.
వికేంద్రీకరణ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల స్వాగతించారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో చంద్రబాబుకు కనువిప్పు కలగాలి అన్నారు మాజీ మంత్రి కన్నబాబు. సుప్రీం కోర్టు తీర్పు న్యాయానికి ధర్మానికి అనుగుణంగా ఉందన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే చివరికి సి.పి.ఐ కూడా అడ్డుకుందన్నారు కన్నబాబు. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. జగన్ కు షాక్ అంటూ అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు కన్నబాబు.
సుప్రీంకోర్టు రాజధాని అంశంపై విచారణ ను వచ్చే జనవరి 31 కు వాయిదా వేసింది.ప్రస్తుతం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడంతో వైసీపీ మంత్రులు, నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పులను కూడా ఇష్టానుసారంగా ప్రచారం చేసుకోవటం దారుణమని వారు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరితో ముందుకు వెళుతుందని అన్నారు. ఇలాంటి పరిణామాలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అవసరం అయితే న్యాయ స్దానంలోనే ప్రతిపక్షాలకు తగిన బుద్ది చెబతామని అన్నారు.