ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఏకం కావాలని ఇప్పటికే చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా పిలుపునిచ్చారు. అయిష్టంతోనే కామ్రేడ్లు కూడా చేతులు కలిపారు. అయితే జనసేన పొత్తు టిడిపితో ఉంటుందా? బీజేపీతో ఉంటుందా? ఎవరితో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే పవన్‌ కల్యాణ్‌ సిఎం అవుతారు ? ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ.  


ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతుందని చెప్పిన జనసేన అధినేత ఆ దిశగా అడుగులు వేస్తున్నారా ? ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా చేస్తామంటున్న పవన్‌ మాటల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి ? ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వమంటున్న పవన్‌ కల్యాణ్‌ రానున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటారు ? బీజేపీతో లాభమా టిడిపితో అధికారం సాధ్యమా ? అన్నదే ఇప్పుడు ప్రధాన అంశం. 


జనసేనకి బలమైన లీడర్‌ లేదన్నది ఆపార్టీకి కూడా తెలుసు. బూత్‌ మేనేజ్‌ మెంట్‌ మెంబర్లు కూడా లేదని స్వయంగా ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణే స్పష్టం చేశారు. అయితే రూట్‌ మ్యాప్‌ ఇవ్వని కారణంగా టిడిపితో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయించానని ఇటీవలే జనసేన అధినేత ప్రకటించారు. ఈ భేటీ ముగిసిన కొద్దిరోజులకే విశాఖ పర్యనటలో ప్రధాని మోదీని కలిసి భవిష్యత్‌ బ్రహ్మాండంగా ఉంటుందని ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చారు. దీంతో జనసేనానిని బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో అడుగులు వేయబోతున్నారని కొందరు వాదించారు. అయితే టిడిపి-జనసేన- బీజేపీ కలిసి రంగంలోకి దిగుతాయని ఆ పార్టీ ఉమ్మడి సిఎం అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌ అవుతారని కూడా వార్తలు వినిపించాయి. 


ఒకవేళ పవన్‌ కల్యాణ్‌ - చంద్రబాబు కలిసి రంగంలోకి దిగితే ఎవరెన్నిన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది తేలాల్సి ఉంది. అంతేకాదు సిఎం అభ్యర్థి ఎవరన్నది కూడా స్పష్టం చేయాల్సి ఉంది. ఒకవేళ చంద్రబాబు సిఎం అయితే మరి జనసేన అధినేత ఏ పదవి తీసుకుంటారన్నది పాయింట్‌. పవన్‌ కల్యాణ్‌ కి పదవులపై ఆసక్తి లేకపోయినా ఆయన పార్టీ నేతలు, అభిమానులు మాత్రం ఊరుకుంటారా ? సిఎం పదవి తీసుకోవాల్సిందేనని పట్టుబడతారు. మరి చంద్రబాబు అండ్‌ టీమ్‌ జనసేన కోరికని తీర్చుతుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. 


ఇక రెండవది టిడిపితో కాకుండా బీజేపీతో వెళ్తే జనసేన ఎన్నిసీట్లు గెలుస్తుందన్నది కూడా ఆలోచించాల్సిన విషయమేనంటున్నారు. ఎందుకంటే కాషాయానికి ఏపీలో పట్టులేదు. ఇక జనసేన అధినేతకి ఇమేజ్‌ ఉన్న గెలుపుకి అదెంత ఉపయోగపడతాయన్నది ఆలోచించాల్సిన విషయం. గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన జనసేన ఇప్పుడు బీజేపీతో కలిస్తే ఎన్ని సీట్లు అందుకుంటుంది, టిడిపితో జత కలిస్తే ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది… పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగితే ఎక్కడెక్కడ గెలుస్తుంది అన్నది చర్చనీయాశంగా మారింది. 


ఒక్కొక్కరు  ఎన్నికల పోరులోకి దిగినా, విపక్షాలన్నీ పొత్తులు పెట్టుకొని ఏకమైనా వైసీపీపార్టీని ఏం పీకలేరని ఇప్పటికే అధికారపార్టీ ధీమాతో చెబుతోంది. అందుకు కారణం ఈ లెక్కలేనంటున్నారు రాజకీయవిశ్లేషకులు.  175 సీట్లలో పోటీ చేసే సత్తా లేని పవన్‌ కల్యాణ్‌ మాటలు సినీ డైలాగులేనని ఇప్పటికే వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానమన్న పవన్‌ ఆశలన్నీ అడియాసలేనని వైసీపీ అధికాపార్టీ ప్రతినిధి సజ్జల కౌంటర్‌ ఇచ్చారు. స్టార్‌ హీరో కాబట్టి ఏదో ఏదో మాట్లాడుతాడని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతూ వచ్చే ఎన్నికల్లోనూ జగన్‌ దే గెలుపని, మళ్లీ భారీ మెజార్టీతో అధికారం అందుకుంటామని ఇప్పటికే మంత్రి రోజా జనసేన అధినేతకి కౌంటర్‌ ఇచ్చారు. 


మహేష్‌ బాబు సినిమాలోని డైలాగ్‌ ని నారా లోకేష్‌ కి అన్వయించి ఆయన చేపట్టబోయే పాదయాత్రపై సెటైర్లు వేశారు. 
అయితే ఎవరి లెక్కలు..ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఎన్నికల వేళ ఏ క్షణాన ఎవరి తలరాత మారుతుందన్నది చెప్పలేం కాబట్టి రానున్న ఎన్నికలో ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది తెలుసుకోవాలంటే మరో ఏడాదిన్నర ఆగాల్సిందే !