Palnadu Politics : పల్నాడు జిల్లా ముప్పాళ్ల (Muppalla) మండలం తొండపి (Thondapi)లో దుండగులు రెచ్చిపోయారు. మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxminarayana) ప్రచార కార్యక్రమంపై రాళ్లదాడి (Stone Attack )కి పాల్పడ్డారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కన్నా లక్ష్మినారాయణ తొండపి గ్రామానికి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కన్నా లక్ష్మినారాయణ పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో కొందరు దుండగులు... టీడీపీ కార్యకర్తలు, కన్నా అనుచరులపై పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు.  అటువైపు రానివ్వకుండా  లైట్లు ఆర్పివేసి, భవనాలపై నుంచి ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు కూడా నిలువరించలేకపోయారు. దుండగుల దాడిలో మాజీ మంత్రి,  టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామి, టీడీపీ నాయకులు శ్రీనివాసరావుతో పాటు మరి కొందరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం తొండపి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది.


అంబటికి ప్రజలు బుద్ధి చెబుతారన్న కన్నా లక్ష్మినారాయణ
రాళ్ల దాడిపై కన్నా లక్ష్మినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి రాంబాబు చేయించిన రాళ్ల దాడికి, రానున్న ఎన్నికల్లో సత్తెనపల్లి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అంబటి రాంబాబు దాడులు చేయించారని, రాళ్ల దాడి చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. ప్రతి చర్యకు ఓటుతో సమాధానం చెబుతారని హెచ్చరించారు. దాడిలో గాయపడిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు కన్నా లక్ష్మినారాయణ, ఇలాంటి దాడులు పార్టీ నాయకులు, కార్యకర్తలని భయపెట్టలేవని, మరింత సంఘటితంగా పోరాడేలా చేస్తాయని హెచ్చరించారు.