Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు వైసీపీ అధినేత,మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో కొన్ని రోజుల నుంచి ప్రత్యర్థులను టార్గెట్‌ చేసుకొని విధ్వంసానికి ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపిస్తూ ఢిల్లీ ధర్నా చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద చేపట్టే ధర్నాకు ముందు మీడియాతో జగన్ మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని కళ్లారా చూడాలంటూ రిక్వస్ట్ చేశారు. 


45 రోజుల్లో 35 హత్యలు: జగన్


ప్రత్యర్థులను పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలన సాగుతోందని ఆరోపించారు జగన్ మోహన్ రెడ్డి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన 45 రోజుల్లోనే 35కుపైగా హత్యలు జరిగాయని... వెయ్యికిపైగా అక్రమ కేసులు నమోదు అయ్యాయని మీడియాకు వివరించారు. వందల ఇళ్లు, ప్రభుత్వం, ప్రైవేటు ఆస్తులను కూడా ధ్వంసం చేశారని విమర్శించారు. తమకు ఓటు వేయలేదని, తమకు ప్రత్యర్థులుగా ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతో ఇదంతా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు జగన్. 


తామ పాలనలో దాడులే లేవు: జగన్


ఆంధ్రప్రదేశ్‌లో అసలు ప్రజాస్వామ్యమే లేదన్న జగన్ మోహన్ రెడ్డి తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దాడులు, దౌర్జన్యాలు జరగలేదని వివరించారు. 45రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం చేపట్టిన దుశ్చర్యలను కళ్లకు కట్టినట్టు ఫొటోగ్యాలరీ రూపంలో తీసుకొచ్చామని అన్నింటినీ పరిశీలించి ఏపీలో ఏం జరుగుతుందో అంచనాకు రావాలని అభ్యర్థించారు. 


రెడ్‌బుక్ రాజ్యాంగం: జగన్


ఎన్నికల ముందు రెడ్‌ బుక్‌ చూపిస్తూ అందర్నీ బెదిరించిన లోకేష్ ఇప్పుడు ప్రభుత్వం భాగమై ఉన్నారని గుర్తు చేశారు. లోకేష్ చెప్పినట్టుగానే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతీకార దాడులు జరుగుతున్నాయన్నారు జగన్. రెడ్ బుగ్ పేరుతో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి మరీ జనాలను బెదిరిస్తున్నారని అన్నారు. పోలీసు అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదని అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలే పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు జగన్. అందుకే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. 


ఇప్పుడు చంద్రబాబు తీసుకొచ్చిన సంప్రదాయం మంచిదికాదన్నారు జగన్. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండొచ్చని రేపు తాము రావచ్చని అప్పుడు తాము కూడా ఇలాంటివి ప్రోత్సహిస్తే పరిస్థితి ఏంటో గుర్తు చేసుకోవాలని జగన్ హెచ్చరించారు. 


Also Read:లేని, రాని ప్రతిపక్ష హోదా కోసం జగన్ పోరాటం - ప్రజల నుంచి సానుభూతి కోసమేనా ?


జగన్‌కు అఖిలేష్ మద్దతు 
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్‌కు ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్ మద్దతు ప్రకటించారు. ఏపీలో జరుగుతున్న దాడులను అఖిలేష్‌కు జగన్ వీడియో రూపంలో వివరించారు. అనంతరం మాట్లాడిన అఖిలేష్‌... అధికారంలోకి ఎవరు వచ్చినా ప్రత్యర్థులపై దాడులు చేయడం సరికాదన్నారు. అధికారంలో ఉన్న వాళ్లు శాంతియుతంగా ఉండాలని సూచించారు. ఒకరు ఇవాళ అధికారంలో ఉంటే రేపు మరొకరు అధికారంలో ఉంటారని గుర్తు చేశారు. ప్రాణాలు తీయడం, హత్యలు చేయడం ప్రాజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా బుల్డోజర్‌ సంస్కృతి నడుస్తోందని... ఎక్కడైనా ఇది మంచి పద్దతి కాదన్నారు అఖిలేష్.