ఏపీ ప్రభుత్వం మరోసారి తనను సస్పెండ్ చేయడంపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. ఈ పరిణామంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఒక కేసు గానీ, ఛార్జిషీట్ గానీ ఏమీ లేదని అలాంటిది తనను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ పైన 12 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఉన్నాయని, ఐఏఎస్ శ్రీలక్ష్మిపైన కూడా ఛార్జిషీట్లు ఉన్నాయని గుర్తు చేశారు. వారికి వర్తించని నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని నిలదీశారు. మరోసారి తనను సస్పెండ్ చేయడంపై తాను కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. బుధవారం ఏబీ విలేకరుల సమావేశం నిర్వహించారు.


‘‘నన్ను సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం చూపించిన కారణం.. క్రిమినల్ కేసు. ఏసీబీ వాళ్లు ఆ కేసు పెట్టిన మాట నిజమే. ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటిదాకా విచారణ మొదలుకాలేదు. ఛార్జిషీటు వెయ్యలేదు. అసలు విచారణే లేదు.. అయినా సాక్షిని ప్రభావితం చేశానని ప్రభుత్వం అంటోంది. సలహాదార్లు ప్రభుత్వాన్ని ఎలా తప్పుదోవ పట్టించారనేది దీన్ని చూస్తే అర్థం అవుతోంది. గతంలోని సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాలు చేస్తూ గర్నమెంట్ సుప్రీం కోర్టుకి వెళ్లినా అక్కడా ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ అవే కారణాలు చూపిస్తూ ఎలా సస్పెండ్ చేస్తారు? ఇవన్నీ లీగల్ గా చెల్లేవి కావు. కోర్టులో నిలబడవు.


ఆయన కింద పని చేసే కంటే అడవిలో వ్యవసాయం మేలు: ఏబీవీ
‘‘కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు నన్ను టార్గెట్ చేశాయి. కోడికత్తి కేసు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చుస్తే గంటల్లోనే అడ్డుకున్నాను. ఎన్నో వెధవ పనులు అడ్డుకున్నందుకే నన్ను టార్గెట్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతా అని రాజ్ భవన్ గేటు ముందు నేను కామెంట్ చేశానా? ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తాను. సమాజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్నాను. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసేకంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని ఒక కవి అన్నాడు’’ అని ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడారు.


సస్పెన్షన్ ఉత్తర్వుల్లో కారణాలివీ..
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో క్రమశిక్షణారాహిత్య వ్యాఖ్యలు చేసినందుకు ఏబీపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు పేర్కొన్నారు. 1969 ఆలిండియా సర్వీస్ రూల్ 3, సబ్ రూల్ 3 ప్రకారం సస్పెన్షన్ వేటు వేసినట్టు అందులో తెలిపారు. నేరపూరిత దుష్ర్పవర్తనకు పాల్పడినందుకు సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం వివరించింది. గతంలో కూడా అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు కోర్టులో గెలిచి తిరిగి పోస్టింగ్‌ తెచ్చుకొన్నారు. ఇటీవలే బాధ్యతలు కూడా స్వీకరించారు.


1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఏబీ, టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. అప్పుడు రూల్స్‌ అతిక్రమించారన్న ఆరోపణలతో జగన్ సర్కారు ఆ మధ్య తొలుత సస్పెండ్‌ చేసింది. తనపై తీసుకున్న చర్యలను తప్పుబడుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు.