Sajjala Ramakrishna Reddy on Chandrababu: సీఎం జగన్ పైన జరిగిన దాడి హత్యాయత్నమే అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి ఆరోపించారు. సరిగ్గా కణతి చూసి గురి చూసి దాడి చేశారని.. కొంచెం తేడా వచ్చినా ప్రాణం పోయేదని అన్నారు. చంద్రబాబే ఈ దాడి చేయించారని సజ్జల తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణను సహించలేక చంద్రబాబు ప్రీ ప్లాన్డ్ అటాక్ చేయించారని సజ్జల ఆరోపించారు. తాడేపల్లిలోని సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.


సీఎం జగన్ కు సున్నితమైన భాగంలో గాయం అయిందని.. కనుబొమ్మకు ఇంకాస్త కింద రాయి తగిలి ఉంటే కన్ను పోయి ఉండేదని అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వెల్లంపల్లికి కనుగుడ్డు పోయిందని సజ్జల అన్నారు. సీఎం జగన్ కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలి ఆయన కన్ను దెబ్బతిన్నదంటే ఎంత బలంగా దాడి ప్రయోగించారో తెలుసుకోవచ్చని అన్నారు. దాడి చేయడం కోసం నిందితులు ఎయిర్ గన్ దాడి ఉండవచ్చని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు.


‘‘దాడి జరిగిన తీరు చూస్తే ఎయిర్ గన్ లాంటి దానిని వాడి ఉండాలి. చేతితో రాయి విసిరితే జగన్ కు అంత బలంగా తగలదు. ప్రజల్లో ఒక వ్యక్తి ఈ పని కచ్చితంగా చేసి ఉండడు. పక్కా ప్లాన్‌తో చేసిన పని ఇది. ఘటనపై విచారణ జరపాలని ఎవరైనా చెబుతారు. ఎల్లో మీడియా దీన్ని పూర్తిగా భద్రతా సిబ్బంది వైఫల్యం అని చెబుతోంది. కడుపుకు అన్నం తినేవారు ఎవరూ ఇలా మాట్లాడరు. చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతి కోసం ఎలా నటించాడో తెలుసు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేతికి కట్టుతో వెళ్లి పాల్గొన్నాడు. కానీ చంద్రబాబు డ్రామాలకు ప్రజలు బుద్ధి చెప్పారు’’ అని సజ్జల రామక్రిష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


‘‘ఇది కోల్డ్‌ బ్లడెడ్‌ ప్రీ ప్లాన్‌ మర్డర్‌ అటెంప్ట్‌. ఇప్పటిదాకా ప్రతి చోట చంద్రబాబు రెచ్చగొడుతూనే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఓడిపోతారని తెలియడంతోనే చంద్రబాబు ఈ కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కూడా.. దేవుడి, ప్రజలు ఆశీస్సులతో జగన్‌ కు ఏమీ కాలేదు. జగన్ సింపతీతో ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ సీపీ శ్రేణులు చాలా సంయమనంగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు’’ అని సజ్జల రామక్రిష్ణారెడ్డి చెప్పారు.