Ramoji Rao News: ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం రామోజీరావు జీవితాంతం పరితపించారని ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా విజయవాడలోని కానూరులో రామోజీరావు సంస్మరణ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా, మంత్రులు, రామోజీరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ మాట్లాడుతూ.. ఈ సభను ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 


ఈ సభ తన తండ్రి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా భావిస్తున్నామని అన్నారు. ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదని.. మనం చేసే పనులు ప్రజలకు ఉపయోగపడేవా? కాదా? అని మాత్రమే చూడమనేవారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడూ ఒకడుకు ముందుండేవారని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు రక్షా కవచంగా నిలిచేవారని.. దేశంలో ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారని గుర్తు చేశారు. తన తండ్రి స్ఫూర్తితో తాము ఎల్లప్పుడూ ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని మాటిస్తున్నట్లు చెప్పారు.


అమరావతి కోసం రూ.10 కోట్ల విరాళం
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సీహెచ్ కిరణ్ రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. నవ్యాంధ్ర రాజధాని పేరును అమరావతిగా రామోజీరావే సూచించారని అన్నారు. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలనేది ఆయన ఆకాంక్ష అని అన్నారు. అందుకే తాము అమరావతి నిర్మాణానికి రూ.10 కోట్లు విరాళం ప్రకటిస్తున్నామని అన్నారు. దీనికి సంబంధించిన చెక్కును మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఈనాడు ఎండీ కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి చేతుల మీదుగా చెక్కులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు.


జనం అభిప్రాయాలే ఆయన పేపర్లో - పవన్ కల్యాణ్ 


రామోజీరావు సంస్మరణ సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను చూసిన రామోజీరావు లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదు. 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడాను. రామోజీరావు ప్రజల పక్షపాతి... జర్నలిస్టు విలువను కాపాడటంలో ఉన్నారు. ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచించారు. 2019లో నన్ను లంచ్ మీటింగ్ కు రామోజీరావు ఆహ్వానించారు. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు, పత్రికా రంగం గురించి మా మధ్య చర్చ సాగింది. జనం తాలూకా అభిప్రాయాలే ఈనాడు పేపర్లో ప్రతిబింబిస్తాయి.


లంచ్ మీటింగ్ సమయంలో రామోజీరావు వేదనను నేను నేరుగా చూశాను. ప్రజాస్వామ్యానికి పత్రిక స్వేచ్చ ఎంతో అవసరమో ఈ దేశానికి చాటి చెప్పారు. అటువంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. పేపర్ ఒక్కటే నడపటం చాలా కష్టం.. కానీ విలువలతో ఆయన ముందుకు సాగారు. ఇతర వ్యాపారాలపై దాడులు చేసినా.. తట్టుకుని.. జర్నలిస్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగారు. అవన్నీ తెలుసుకుని నాకు చాలా సంతోషం అనిపించింది.


నువ్వు ఏం చేస్తావో.. ఏం నమ్ముతావో త్రికరణ శుద్దిగా చేయి అని నాకు రామోజీరావు సూచించారు. రైట్ టూ ఇన్ ఫర్మేషన్ యాక్టు గురించి ఉద్యమ కర్తగా వ్యవహరించారు. ఆర్.టి.ఐ ద్వారా ప్రభుత్వం ఏమి చేసినా ప్రజలు తెలుసుకోవచ్చని చాటి చెప్పారు. స్టూడియోలు కట్టినా, సినిమాలు చేసినా.. ఆదర్శ జర్నలిస్టు భావాలు చాలా ఉన్నాయి. జర్నలిస్టు విలువలను కాపాడిన రామోజీరావు పత్రికాధిపతిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను బెదిరించినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇలా దైర్యంగా నిలబడటానికి చాలా దైర్యం కావాలి. 


అమరావతిలో రామోజీ విగ్రహం పెట్టాలి - పవన్
ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కూటమి విజయ వార్త విన్నారా లేదా అని నేను కూడా అడిగి తెలుసుకున్నా. విజయ వార్త విన్న తర్వాతే ఆయన తన ప్రాణాలు విడిచారు. అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ఎవరు ఏస్థాయిలో ఉన్నా పత్రికా స్వేచ్చను కాపాడాలి. గతంలో అన్ని పార్టీలను పైకి ఎత్తిన సందర్భాలు ఉన్నాయి.. విమర్శలు చేసిన సందర్భాలు చూశాం. ఆయన జర్నలిస్టిక్ వారసత్వ విలువలను ప్రతి జర్నలిస్టు తీసుకోవాలి. అది ఎంతవరకు తీసుకుంటారో ప్రతి జర్నలిస్టు తెలుసుకోవాలి. రామోజీ జీవితం నిరంతర ప్రవాహం.. అందరూ తెలుసుకోవాలి’’ అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.