Guntur to Ayodhya Train News: ఇటీవల అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకోవాలనుకొనే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా ఏపీలోని గుంటూరు నుంచి ఓ రైలును అయోధ్యకు ప్రారంభించింది. ఏపీ నుంచి బయలుదేరిన ఈ తొలి రైలుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ఆమె వెంట బీజేపీ నేషనల్ సెక్రటరీ సత్య కుమార్ తదితరులు కూడా ఉన్నారు. ఏపీ నుండి అయోధ్యకు వెళుతున్న మొదటి రైలు ఇదేనని ఆమె అన్నారు. వేలాది మంది భక్తులను అయోధ్యకు పంపిస్తున్న పుణ్యం ఏపీకి దక్కుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పైన శ్రీరాముడి చల్లని చూపు ఉండాలని అన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం బీజేపీ కల అని.. దాన్ని నిజం చేసిన నాయకుడు ప్రధాని మోదీ అంటూ పురందేశ్వరి కొనియాడారు. ఎన్నో జన్మల పుణ్యఫలంతో ప్రధాని మోదీ ఈ ఆలయం నిర్మించగలిగారని అన్నారు. 


పొత్తులపైనా వ్యాఖ్యలు
ప్రస్తుతం ఏపీలో పొత్తుల వ్యహారం కీలకంగా మారడంతో దానిపై కూడా పురందేశ్వరి స్పందించారు. పొత్తుల వ్యవహారం బీజేపీ అగ్రనాయకత్వం చూసుకుంటుందని అన్నారు. చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో తమకు తెలియదని..  చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారనేది మీడియా చెబుతుంటేనే తమకు తెలిసిందని అన్నారు. ఏపీలో పొత్తుల గురించి బీజేపీ అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. ఎప్పుడు, ఎవరితో, ఎలా భేటీ అవ్వాలో పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో బీజేపీ పెద్దలు చూసుకుంటారని అన్నారు. జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారాలపై తమకు అవగాహన ఉండదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. అలాంటి విషయాలపై తాము స్పందించడం సరికాదని.. తమకు కొన్ని పరిమితులు ఉంటాయని అన్నారు. కొద్ది రోజుల్లో ఏపీలో ఏం జరుగుతుందనేది మీరే చూస్తారని అన్నారు.