Prattipati Pullarao: వరద ప్రాంతాలలో పేద ప్రజలకు సాయం చేయడంలో సీఎం జగన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుందని మాజీ మంత్రి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్తిపాటి విమర్శించారు. వరదలతో కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించి చంద్రబాబు ధైర్యం చెబితే రాజకీయాలు చేస్తున్నారనటం సిగ్గుచేటని అన్నారు. సీఎం హెలికాప్టర్లో చెక్కర్లు కొట్టి వరద బాధితులను పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి పేదలపై కక్ష సాధిస్తున్నారని విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నుంచి ఉచితంగా పేదలకు అందజేసిన బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో ఆదివారం ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం నిర్వహించారు.


ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న 1.41 కోట్ల తెల్ల కార్డు దారులకు ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. నవశకం పేరుతో ఎస్సీ ఎస్టీలను మోసం చేసి విద్యుత్ బిల్లులతో బాధడం దుర్మార్గమని అన్నారు. నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి పథకాలలో లబ్ధిదారులు తగ్గించటం దారుణమని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో పేదవాడికి వైద్యం అందుబాటులో లేదు. డెంగీ మలేరియా వంటి విష జ్వరాలతో  ప్రజలు అల్లాడుతున్నారు. 1,712 మంది వైద్యులను వివిధ కారణాలతో ప్రభుత్వం తొలగించింది. రాష్ట్రంలో వైద్యులు లేకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆగస్టు 15 నుంచి ఎలా అమలు చేస్తారో మంత్రి సమాధానం చెప్పాలి. పంచాయతీలలో నిధులు లేక బ్లీచింగ్ చల్లే పరిస్థితి కూడా లేదు. గ్రామాలలో పారిశుధ్యం పడకేసింది. 


ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పోలవరం పరివాహక ప్రాంతంలోని ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని కోరడం సీఎం అసమర్థతే కారణం. ఏపీ కన్నా తెలంగాణలో వరద సాయం పేదలకు ఎక్కువగా అందింది. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి వరదలతో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవాలి’’ అని ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు.