AP latest News: ఆకివీడుకు చెందిన 75ఏళ్ల వృద్ధురాలు కంకణాల కృష్ణవేణికి తన కుటుంబ కష్టాలు చెప్పుకొనేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని వెదుక్కొంటూ విజయవాడ వచ్చేసింది. విజయవాడలో ఉంటారని చెబితే వచ్చేసిందామె. బుధవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్  పంచాయతీరాజ్ కమిషనరేట్ కి వస్తున్నారని తెలుసుకొని గేటు బయట కూర్చోంది. సమావేశం ముగించుకొని వెళ్తుంటే తన బాధ చెప్పుకోవాలని ముందుకు వచ్చిన ఆ వృద్ధురాలి పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ పెద్దామె ఎప్పుడు తిన్నాదో ఏమో అని.. తన సిబ్బంది వాహనంలోకి ఆమెను ఎక్కించి తన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆమెకు భోజనం పెట్టించి ఆ తరవాత సమస్యలు విన్నారు.


ఆకివీడులోని చేయానగరం ప్రాంతానికి చెందిన  కంకణాల కృష్ణవేణి భర్త మరణించారు. ఒక్కగానొక్క కొడుకు ముత్తయ్య బొమ్మలు అమ్ముకొంటూ ఇంటిని నెట్టుకొస్తున్నాడు. ఓ రేకుల షెడ్ లో నివాసం. ఆమెకు వచ్చే వృద్ధాప్య పింఛను మందులకు సరిపోతుంది. ఇంటి స్థలం ఉన్నా, తనకు ఇల్లు కట్టుకునే స్థోమత లేదని, కొడుకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇల్లు కట్టించాలని కోరడంతో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ కు ఈ వృద్ధురాలి బాధలు తెలియచేయాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. 




కృష్ణవేణిని జాగ్రత్తగా ఆకివీడు ఆమెకు పంపి, కొడుకుకి అప్పగించాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ తో పేషీ అధికారులు మాట్లాడారు. వివరాలు అందించారు. అదే విధంగా కృష్ణవేణిని ప్రత్యేక వాహనంలో ఆకివీడు చేర్చి ఆమె కుమారుడు ముత్తయ్యకు అప్పగించారు. జిల్లా కలెక్టర్ సిహెచ్.నాగరాణి ఆదేశాలతో గృహ నిర్మాణశాఖ అధికారులు కృష్ణవేణికి ఆకివీడులోని ఉప్పనపూడి లే అవుట్ లోని 1896 సర్వే నంబరులో ఉన్న స్థలాన్ని గురువారం ఉదయం పరిశీలించారు. అక్కడ ఇంటి నిర్మాణం నిమిత్తం అవసరమైన నిధులు మంజూరు చేశారు. వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.




ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి  విరాళాలు అందిస్తున్న సినీ, వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులకు పవన్ కల్యామ్‌ ధన్యవాదాలు తెలియజేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా, సహాయం చేసిన ఔదార్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ సోషల్ మీడియా వేదికగా పేరుపేరున థాంక్స్ చెబుతున్నారు. ఈ సహాయం ఎంతోమందికి భరోసా కల్పిస్తుందని అంటున్నారు.