Pawan Kalyan Comments: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి స్థలం ఇచ్చారనే ఒకే ఒక్క కారణంతో ఇప్పటంలో (Ippatam News) వైఎస్ఆర్ సీపీ నాయకులు ఇళ్లను కూల్చేశారని ఆరోపించారు. ఇప్పటం ప్రజలకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఇప్పటం గ్రామ ప్రజలలో ఉన్న తెగింపు అమరావతి రైతులకు కొంచెం ఉండి ఉంటే అమరావతి రాజధాని ఎక్కడికీ కదిలేది కాదని స్పష్టం చేశారు. ఇప్పటం గ్రామస్థులు తనను సొంతబిడ్డలా ఆదరించారని అన్నారు. మంగళగిరి పార్టీ (Janasena Party Office) కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం (నవంబరు 27) ఇప్పటం బాధితులకు పవన్ కల్యాణ్ ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ నేతల తీరు పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘వైఎస్ఆర్ సీపీ రాజకీయ పార్టీనా? లేదా ఉగ్రవాద సంస్థా? మా నాయకుల్ని బెదిరిస్తారా? మాకు ఎవరూ అండగా ఉండొద్దా? రాజకీయాలు మీరే చేయగలరా? మేం చేయలేమని అనుకుంటున్నారా? రాజకీయాలు మేం చేసి చూపిస్తాం.. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి తీరుతాం. ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం. జనాలు మాకు ఓట్లు వేసినా, వేయకపోయినా నేను అండగా ఉంటా. మాది రౌడీసేన కాదు.. విప్లవసేన. యువత కోసం ఆలోచించే నేతలు పాలకులుగా రావాలి. ప్రజల్లో ఇంతగా అభిమాన బలం ఉన్న తననే ఇంతగా ఇబ్బందులకు గురిచేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?’’
ఇప్పటంలో కూలిన ప్రతి గడపపై పడ్డ పోటు నా గుండెల్లో దిగింది - పవన్
ఇప్పటంలో సభ కోసం నాకు స్థలం ఇచ్చారని, వారి ఇళ్లు కూల్చడం నేను మర్చిపోను. అక్కడ కూల్చిన ప్రతి గడపపై పడ్డ గునపపు పోటు నా గుండెపై కొట్టినట్లే అనిపించింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా’’ అని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
తాను కులాలను ఎప్పుడూ ద్వేషించబోనని అన్నారు. తాను ఎప్పుడు ప్రసంగించినా తన కులంలో పుట్టిన నేతలతోనే తిట్టించి విషయం కులాల మీదకి నెడతారని అన్నారు. ఎలాంటి వికృతభావం లేకపోతే వాళ్లతోనే ఎందుకు తిట్టిస్తారని ప్రశ్నించారు. విభజించి పాలిచిన బ్రిటిష్ వారు దేశం నుంచి వెళ్లిపోయినా ఆ గుణగణాలు వీరిలో ఉన్నాయని.. ఆ పరిస్థితి మారాలని అన్నారు.