ఏపీలో గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల హాజరు, సమయపాలన కచ్చితత్వం కోసం తీసుకొచ్చిన యాప్ వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గతంలో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు తిరిగి మళ్లీ అన్ని నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెలవుల సమాచారం కూడా ఇకపై యాప్‌లోనే అప్లై చేయాలని నిబంధన విధించారు. ఉదయం 9 గంటల వరకు ఖచ్చితంగా స్కూలుకు వచ్చి హాజరు వేసుకోవాల్సిందేనని లేకపోతే ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని విద్యాశాఖ తేల్చి చెప్పింది. అయితే, ఈ విధానంపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
విపక్షాలు కూడా ఈ విధానం పట్ల విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ట్విటర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం టీచర్లపై బాధ్యతలు గుర్తు చేసేలా వ్యవహరిస్తే, ప్రజలు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేల బాధ్యతల్ని గుర్తు చేసేలా ఒక యాప్ ను రూపొందించాలని అన్నారు. జవాబుదారీతనం అనేది ఒకవైపు నుంచే కాకుండా రెండు వైపుల నుంచి ఉండాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ట్వీట్ చేసిన ఓ కార్టూన్ లో ఫన్నీగా ఉపాధ్యాయుల పరిస్థితిని చూపించారు. వారు యాప్ లో అటెండెంన్స్ వేయించుకోవడం కోసం సిగ్నల్ లేదని తిరుగుతున్నట్లుగా చూపించారు. సీఎం జగన్ హెలికాప్టర్ లో అక్కడికి వచ్చి ఆ పరిస్థితిని ఆరా తీసినట్లుగా కార్టూన్ గీశారు. ‘‘పాపం వాళ్లు స్కూల్ కి రాగానే పిల్లలకు పాఠాలు చెప్పుకునేటోళ్లు.. అదేదో యాపట.. దాని సిగ్నల్ కోసం చెట్టుకొకరు, పుట్టకొకరు అట్టా తిరుగుతున్నారు సార్’ అని అటెండర్ సీఎం జగన్ కి చెబుతున్నట్లుగా ఉంది. ఉపాధ్యాయులుకు ఒక రూల్, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఒక రూల్ ఉండకుండా జవాబుదారీతనం ఇద్దరికీ ఉండేలా చేయాలని అన్నారు.
ఆగస్టు 20న కడప జిల్లా పర్యటనకు పవన్ కల్యాణ్
ఏపీలో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు.
ఇప్పటికే పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష విరాళం అందించారు. బహిరంగ సభల్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆగస్టు 20న వైఎస్‌ఆర్ కడప జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే, పవన్ కల్యాణ్ కడప జిల్లా పర్యటనకి ఇంతకీ పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.