AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డేంజర్ జోన్ లో ఉందని ఆ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రజా ప్రతినిధులపై కేసులు ఉపసంహరించేందుకు జీవోలు జారీ చేసిన అంశంపై హైకోర్టు ఇలా స్పందించింది. ప్రభుత్వం ఇలా జీవోలు జారీ చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2020 సెప్టెంబర్ 16న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రజా ప్రతినిధులపై కేసులను ప్రభుత్వాలు ఉపసంహరించడానికి వీల్లేదని అన్నట్లు ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది.


తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా..


కేసులు ఉపసంహిరించుకోవచ్చంటూ న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చిన తర్వాతే.. ప్రభుత్వాలు జీవోలు జారీ చేయాలని తెలిపింది. అంతే కానీ ముందు జీవోలు ఇచ్చి.. తర్వాత హైకోర్టు అనుమతి అడగడం ఏమిటని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. జీవోల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే... తామే ఆయా జీవోలను కొట్టి వేస్తామని హైకోర్టు తెలిపింది. హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 


ఉపసంహరించుకోవడానికి వీల్లేదు..!


దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసి, తీర్పులు ఇవ్వాలని కోరుతూ బీజేపీ లీడర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టుల అనుమతి లేకుండా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది సుప్రీం కోర్టు. 2020 సెప్టెంబర్ 16 నుండి 2021 ఆగస్టు 25 లోపు రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులపై ఎన్ని కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చిందనేది పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అధికార వైసీపీ ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం మొత్తం తొమ్మిది జీవోలను ఇచ్చినట్లు విచారణలో హైకోర్టు ప్రస్తావించింది. 


10 కేసులు ఉపసంహరించుకునేందుకు సర్కారు జీవోలు..


మరోవైపు జగ్గయ్య పేట నియోజకవర్గ శాసన సభ్యుడు సామినేని ఉదయ భానుపై 10 కేసులు ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఈ జీవోను ఏపీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు సవాల్ చేశారు. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై కేసుల్ని ఉపసంహరించేలా జీవోలు జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.


ఉపసంహరణ ప్రతిపాదనలు సంబంధిత కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుండి రావాలని పిటిషన్ కృష్ణాంజనేయులు తరఫు న్యాయవాది వెంకటేశ్ వాదనలు వినిపించారు. అయితే అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వమే జీవోలు ఇచ్చి కేసుల్ని ఉపసంహరించాలని పీపీలను కోరిందని వెంకటేశ్ అన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన హోం శాఖ ప్రభుత్వ న్యాయవాది వి. మహేశ్వర రెడ్డి... జీవోలు  ఇచ్చినప్పటికీ ఆయా కేసులను ఉపసంహరించలేదని వెల్లడించారు.