Weather Latest News: కొద్ది రోజులుగా అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావం తప్పడంతో వాతావరణం దాదాపు పొడిగా ఉంటోంది. ఈ సమయంలో భారత వాతావరణ కేంద్రం మరో ప్రకటన చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఆగస్టు 19 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడనుందని, ఇది ఉత్తర - దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు అంతర్భాగంగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంటుందని వివరించింది. ఇది తదుపరి 24 గంటల్లో ఈ తుపాను బలపడనున్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణలో నేటి రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో తేలికపాటి జల్లులు
ఇక తెలంగాణలో రానున్న మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బుధవారం బలహీనపడింది. రాష్ట్రానికి నైరుతి దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 49.92 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావలసిఉండగా, బుధవారం (ఆగస్టు 17) ఉదయం 8.30 గంటల వరకు 83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 66 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లుగా రాష్ట్ర ప్రణాళిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, 6 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లుగా గుర్తించారు.
‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 23 డిగ్రీల వరకూ ఉండే అవకాశం ఉంది. నైరుతి దిశల నుంచి గాలులు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈ ప్రాంతాల్లో బుధవారం కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లులు పడతాయని అంచనా వేశారు. తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
వాయుగుండం బలహీనపడి తీరాన్ని దాటడంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు నుంచి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.