భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయిన దగ్గుబాటి పురందేశ్వరి బెజవాడ రానున్నారు. అధ్యక్ష భాధ్యతలను తీసుకునేందుకు ఆమె కేంద్ర కార్యాలయానికి రానున్న వేళ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 13న అంటే గురువారం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా విజయవాడ వస్తున్న ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నూతన అధ్యక్షురాలికి బాధ్యతలను అప్పగించే ఏర్పాట్లను మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సొము వీర్రాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని వీర్రాజు పిలపునిచ్చారు. ఈ ఏర్పాట్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
గన్నవరం నుంచి బెజవాడకు స్వాగత తోరణాలు..
13వ తేదీన దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడకు రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఆమె రోడ్డు మార్గాన విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వస్తారు. దీంతో గన్నవరం నుంచి విజయవాడకు వరకు భారీగా శ్రేణులు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పండగ వాతావరణంలో నూతన అధ్యక్షురాలికి అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నారు.
ఉమ్మడి జిల్లాల నుంచి భారీగా శ్రేణులు
ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలకు చెందిన నాయకులతోపాటుగా ప్రకాశం జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పురందేశ్వరికి స్వాగతం పలికేందుదుకు తరలి రానున్నారు. రాష్ట్ర నాయకత్వంతోపాటుగా, పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, సీఎం రమేష్, జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడ ఈ కార్యక్రమానికి హజరు కానున్నారు.
పురందేశ్వరి స్పెషల్ అట్రాక్షన్
దగ్గుబాటి పురందేశ్వరి, తెలగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు కుమర్తె. నందమూరి తారక రామారావు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చెరగని ముద్రవేశారు. నిమ్మకూరు నుంచి ఆరంభమైన ఎన్టీఆర్ జీవితం పార్టీ ఏర్పాటు చేసి అధికారం దక్కించుకునే వరకు వెళ్ళింది. అయితే కాల క్రమంలో వచ్చిన మార్పులు అనేకం.. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కేంద్రంగా భారతీయ జనతా పార్టీకి సారథిగా ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి పని చేయనున్నారు. తండ్రి రాజకీయ వ్యక్తిత్వాన్ని పుణికి పుచ్చుకొని అటు కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రిగా పని చేసిన పురందేశ్వరి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాద్యతలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపటనున్న దగ్గుబాటి పురందేశ్వరికి అటు నిమ్మకూరు గ్రామం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.