రెంటచింతల: ఏపీలో ఎన్నికల వేళ పల్నాడు జిల్లా మాచర్లలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదని టీడీపీ పోలింగ్ ఏజెంట్ల ఇండ్లకు వెళ్లి హుకుం జారీ చేశారు వైసీపీ నేతలు. వారు ఏజెంట్లుగా కూర్చుంటే చంపేస్తావని బెదిరించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ శ్రేణులు చెప్పిన మాట వినకపోవడంతో టిడిపి కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. 




వైసీపీ కార్యకర్తల దాడులను టీడీపీ శ్రేణులు ప్రతిఘటించే ప్రయత్నంలో ఎదురుదాడికి దిగాయి. ఇరు వర్గాల పరస్పర దాడిలో రెండు కార్లు ధ్వంసం కాగా, పలువురు టీడీపీ, వైసిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ, టీడీపీ పరస్పర దాడుల విషయం తెలుసుకున్న కారంపూడి సీఐ  నారాయణస్వామి అక్కడికి చేరుకుని లాఠీచార్జి చేయడంతో వ్యవహారం సద్దుమణిగింది. 144 సెక్షన్ అమల్లో ఉందని పార్టీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా తిరగకూడదని సూచించారు.


ఓట్లు వేయాలని ప్రమాణం చేయించిన టౌన్ బ్యాంక్ చైర్మన్ 
తిరుపతి: అధికార పార్టీ వైసీపీ నేతలు తిరుపతి ఓటర్లను ప్రలోబపేడుతున్నారు. ఓటర్లకు డబ్బులు పంచి, తరువాత డబ్బులు తీసుకున్న వారిచేత ప్రమాణం చేయిస్తున్నారు టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. తనతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేస్తామని ఓటర్లతో ప్రమాణం చేయించడం వివాదాస్పదం అయింది.  ఓటర్లతో దగ్గర ఉండి ప్రామాణం చేయించిన టౌన్ బ్యాంక్ చైర్మన్ జయచంద్ర రెడ్డి. ఓటర్లతో ప్రమాణం చేయించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి డిమాండ్ చేసింది. ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 


కేసు నమోదు చేసిన పోలీసులు
కొర్లగుంట ఆంజనేయస్వామి ఆలయంలో ఓటర్లతో వారి కుటుంబసభ్యులు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రమాణం చేయించిన వీడియో వైరల్ అయింది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని ఫిర్యాదు మేరకు టౌన్ బ్యాంకు ఛైర్మన్ కేతం రామారావు @ జయచంద్ర రెడ్డితో పాటు సోదిశెట్టి నరేష్ మరో ఇద్దరిపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.