Lakshmi Parvathi: ఎన్టీఆర్‌తో పెళ్లి ఆయనకిష్టం లేదు, మైకు వైర్లు కట్ చేసి రచ్చ - జగన్ నిర్ణయం కరెక్టే: లక్ష్మీ పార్వతి

Advertisement
ABP Desam Updated at: 26 Sep 2022 12:41 PM (IST)

అమరావతి తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో లక్ష్మీ పార్వతి విలేకరుల సమావేశం నిర్వహించారు.

లక్ష్మీ పార్వతి (ఫైల్ ఫోటో)

NEXT PREV

డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చిన అంశంపై వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు. ఒకరి పేరు తొలగించి, మరొకరి పేరు పెట్టడం వల్ల ఎవరికీ నష్టం జరిగినట్లు కాదని లక్ష్మీ పార్వతి అన్నారు. మానవత్వం ఉన్నవారంతా పేరు మార్చడాన్ని ఆమోదించారని అన్నారు.

Continues below advertisement


అసలు ఎన్టీఆర్‌ను తాను పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదని లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వివాహ ప్రకటనను అడ్డుకోవటానికి చంద్రబాబు మైకు వైర్లు కట్ చేసి లైట్‌లు ఆఫ్ చేసి నానా బీభత్సం చేశాడని ఆమె గుర్తు చేశారు. తనను రాజకీయాల్లోకి తీసుకొస్తానని ఎన్టీఆర్ కానీ, తాను కానీ ఏనాడూ అనలేదని లక్ష్మీ పార్వతి అన్నారు.


అమరావతి తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో లక్ష్మీ పార్వతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరి సమక్షంలో జరిగిన తమ వివాహం గురించి ఎవరైనా అనుచితంగా వ్యాఖ్యానిస్తే కేసు పెడతానని, తాను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. ఎన్టీఆర్ భార్య పదవికి మించి తనకు ఇంకే పదవి పెద్దది కాదని అన్నారు. ఎన్టీఆర్ పెరాలిసిస్ అనారోగ్యం, పిల్లలకు ఆస్తుల పంపకాలు, అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో తాను ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చానని వివరించారు. తాను వచ్చిన తర్వాత ఆరోగ్యమే కాకుండా అధికారం కూడా తిరిగి వచ్చిందని లక్ష్మీ పార్వతి గుర్తు చేశారు.


తెలుగు దేశం పార్టీ నాయకులంతా కక్ష్యతో ఉన్నారని, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా పనికిరాడని ప్రజల్లో చాటాలని చూస్తున్నారని ఆరోపించారు. దయ్యాలు వేదాలు మాట్లాడినట్లుగా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. 


జూ. ఎన్టీఆర్‌ పసివాడు - లక్ష్మీ పార్వతి



ఈ దుర్మార్గాలకి అంతం లేదా? వాళ్లని భూదేవి కూడా ఎన్నాళ్లని భరిస్తుంది? చెట్లూ భారం కాదు.. కొండలు భారం కాదు.. కానీ, ఈ విశ్వాసహీనులు, అన్నంపెట్టిన చేతిని నరికిన వారు ఇలా బతికుంటే ఆ భారంతో భూదేవి ఏడుస్తుంది. పసివాడైన జూనియర్ ఎన్టీఆర్ జోలికి ఎందుకు వెళ్తున్నారు. అతను సొంత టాలెంట్ తో ఎదిగాడు. ఎన్టీఆర్ పోలికలు అంతో ఇంతో ఉన్నాయి.. అంతా అనను. కొద్దిగా ఉన్నాయి. అందుకే పైకి ఎదిగాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ను ఇప్పుడు పతనం చేసేందుకు టీడీపీ నాయకులు పని చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చక్కని సంస్కారం కల వ్యక్తి. మంచి బాధ్యతాయుతంగా కామెంట్ చేశారు. ఎన్టీఆర్ ను చంపిన వారు మాత్రం అడ్డగోలుగా మాట్లాడుతున్నారు- లక్ష్మీ పార్వతి


ఎర్రబెల్లి వ్యాఖ్యలపై మండిపాటు
‘‘నాకు వడ్డాణం ఇచ్చుంటే మంత్రి పదవి వచ్చి ఉండేదని ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ఇంటర్వ్యూలో అన్నారు. వెంటనే నేను కేసీఆర్ మేనల్లుడు ఎంపీ సంతోష్ కుమార్ కి లెటర్ పంపించా. ఫోన్ చేసి మీ మంత్రి దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు.. నోరు జాగ్రత్తగా చెప్పుకోవాలని హెచ్చరించా. తర్వాత చంద్రబాబు ఎందుకు నీకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఒక్క సాక్ష్యంతో ఈ విషయాలు నిరూపించినా ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే.’’ అని లక్ష్మీ పార్వతి అన్నారు.

Published at: 26 Sep 2022 12:40 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.