Anil Kumar Yadav Comments: నరసరావుపేట పార్లమెంట్ ఇంచార్జ్ పి. అనిల్ కుమార్ యాదవ్ శనివారం (ఫిబ్రవరి 18) మొట్టమొదటిగా నరసరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఆయన్ను నరసరావు పేట ఎంపీ అభ్యర్థిగా అధికార వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమించే ప్రక్షాళనలో భాగంగా ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ను పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా కొద్ది వారాల క్రితం ఖరారు చేశారు. 


దీంతో తొలిసారిగా అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట నియోజకవర్గానికి చేరుకున్నారు. స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి గడపగడపలోలో ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి వల్ల తప్పకుండా ఈ పార్లమెంట్ స్థానంలో ఏడుకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుస్తామని అనిల్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.


పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లి అందర్నీ వ్యక్తిగతంగా కలుస్తానని అన్నారు. రెండు రోజుల క్రితం మాచర్లలో జరిగిన సంఘటన దురదృష్టకరం అని అన్నారు. కొంతమంది కావాలని వారిని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ‘‘కచ్చితంగా ఆ గ్రామాల్లో పర్యటిస్తాను అక్కడా ఉండేటువంటి పెద్దలతో కూడా మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రయత్నం చేస్తాను. గురజాల మాచర్ల టీడీపీ ఇన్చార్జులు ఇద్దరు దీన్ని రాజకీయంగా మాట్లాడడం సిగ్గుచేటు. నెల్లూరు నుంచి వచ్చాను కదా అని ఏదంటే అది మాట్లాడితే సైలెంట్ గా ఉంటా అని అనుకోవద్దు. టీడీపీ నాయకులు చిల్లర చెయ్యొద్దు’’ అని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.