దేశంలో నమోదైన రాజద్రోహం కేసుల్లో (Sedition Cases) ఏపీ తొలి స్థానంలో ఉంది. ఐపీసీలోని సెక్షన్ 124ఏ ను ఏపీలో ఎక్కువ మందిపై నమోదు చేసినట్లుగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఈ సెక్షన్ కింద 76 కేసులు నమోదు కాగా, ఒక్క ఏపీలోనే 29 కేసులు సెక్షన్ 124ఏ కింద నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. అంటే దేశవ్యాప్తంగా నమోదైన రాజద్రోహ కేసుల్లో 38 శాతం కేసులు ఏపీలోనే నమోదయ్యాయి.


ఆ తర్వాతి స్థానాల్లో మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలు నిలిచాయి. ఇక్కడ ఏడు చొప్పున సెడిషన్ కేసులు నమోదయ్యాయి. నరసాపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ రఘురామక్రిష్ణ రాజుపైన కూడా రాజద్రోహం కేసు నమోదైంది. ఏపీ సీఐడీ ఆయనపై ఈ కేసు పెట్టింది. అయితే, సుప్రీంకోర్టు ఈ కేసు నమోదు చేయడం వెనుక దారితీసిన పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తింది. సెక్షన్ 124A కింద నమోదైన ఈ కేసులను కొనసాగించకూడదని సాధారణ ఉత్తర్వు జారీ చేసింది.


నేరాలు కూడా పెరుగుదల
ఏపీలో 2020 ఏడాదితో పోలిస్తే 2021 ఏడాదిలో నేరాల శాతం పెరిగినట్లుగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వెల్లడించింది. ఈ మధ్య కాలంలో ఎస్సీలపై నేరాలు 3.28 శాతం, ఎస్టీలపై నేరాలు 12.81 శాతం పెరిగాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా నమోదైన ఎస్సీలపై జరిగిన నేరాల్లో 3.95 శాతం, ఎస్టీలపై నేరాల్లో 4.10 శాతం ఏపీలోనే నమోదైనట్లుగా ఎన్సీఆర్బీ నివేదికలో పేర్కొన్నారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై ఎక్కువ నేరాలు జరుగుతున్న రాష్ట్రాల లిస్టులో ఆంధ్రప్రదేశ్‌ 7వ స్థానంలో ఉండగా, 2020లో 8వ స్థానంలో ఉండేది. దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనల్లో మాత్రం ఏపీ మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 150 కేసులు నమోదు కాగా, అందులో 83 ఘటనలు ఏపీలోనే జరిగాయి.


ఎన్సీఆర్బీ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం.. కిడ్నాప్ కేసులు కూడా బాగా పెరిగాయి. 2020లో 737 ఘటనలు జరగ్గా, 2021లో 835 కేసులు నమోదయ్యాయి. మహిళలపై జరిగిన నేర ఘటనలు 2020 కంటే 2021లో 3.87 శాతం పెరిగినట్లుగా స్పష్టం అయింది. 2020లో 17,089 ఘటనలు చోటుచేసుకోగా 2021లో 17,752 కేసులు నమోదయ్యాయి. అయితే, వృద్ధులపై నేరాలు మాత్రం కొద్దిగా తగ్గాయి. 


పిల్లలపై పెరిగిన నేరాలు
పిల్లలపై నేరాలు మాత్రం పెరిగాయి. ఆర్థిక నేరాలూ గణనీయంగా పెరిగాయి. సైబర్‌ నేరాలు కొద్దిగా తగ్గాయి. అయితే, వివిధ నేరాల్లో పోలీసులే నిందితులుగా ఉన్న కేసుల్లో ఏపీ రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. పోలీసులే చట్ట ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడుతున్న ఘటనల విషయంలో బిహార్‌ (4,062) తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో మహారాష్ట్ర (448), రాజస్థాన్‌ (245), గుజరాత్‌ (209) కేసులతో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 185 కేసులతో ఏపీ అయిదో స్థానంలో ఉంది. 


ఇక కస్టడీ మరణాల విషయంలో 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 32 కస్టడీ మరణాలు జరగ్గా.. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో ఆరు చొప్పున కస్టడీ మరణాలు జరిగాయి. ఏపీలో 5 జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో హత్యలు, అత్యాచారాలు కూడా పెరిగాయి. 2020లో 853 మర్డర్లు జరగ్గా, 2021లో 956 నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది కంటే ఏకంగా 103 హత్యలు ఎక్కువ జరిగాయి. హత్యల్లో పెరుగుదల 12.07 శాతంగా నమోదైంది. మహిళలపై రేప్ లకు పాల్పడ్డ ఘటనలు కూడా ఎక్కువయ్యాయి. 2020లో 1,095 అత్యాచార ఘటనలు జరగ్గా, 2021లో 1,188 ఘటనలు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది కంటే 93 కేసులు 2021లో ఎక్కువగా నమోదయ్యాయి. అత్యాచారాలు ఏపీలో 8.49 శాతం పెరగ్గా.. అందులోనూ ఘటనకు పాల్పడ్డ నిందితులు బాధితులకు దగ్గరివారో లేదా తెలిసిన వారో అయి ఉన్నారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అపరిచిత వ్యక్తులు అత్యాచారాలకు పాల్పడ్డారు.