విద్యాసంవత్సరం మొదలై నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు రూ.1,650 కోట్లు పెండింగ్‌లో ఉంచడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులని పరీక్షలు రాయనీయడంలేదని అన్నారు. చదువు పూర్తయిన విద్యార్థులకు మార్కులలిస్టులు, ఇతర సర్టిఫికెట్లు జారీని నిలిపేశాయని అన్నారు.
‘‘పైచదువులు, ఉద్యోగ పరీక్షలు, ఇంటర్వ్యూలకి హాజరయ్యే విద్యార్థులు సర్టిఫికెట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ మధ్యలో ఉన్న విద్యార్థులు పరీక్షలకి దూరం అవుతున్నారు. లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనలు దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజులు విడుదల చేయాలి. 2020-21 బకాయి రూ.600 కోట్లను చెల్లించేది లేదని తేల్చేసిన మీ సర్కారు, 2022-23లో నాలుగో టెర్మ్ ఫీజులు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంది. నాలుగేళ్లుగా పీజీ కోర్సుల బకాయిలు రూ.450 కోట్లు పెండింగ్‌లో ఉంది. టిడిపి ప్రభుత్వ హయాంలో పీజీ కోర్సులకి ఫీజులు చెల్లించగా, మీరు వచ్చాక నిలిపేశారు.
విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న మీరు ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ఏడాదీ సకాలంలో విద్యార్థుల ఫీజురీయింబర్స్ మెంట్ చేయలేదు. ఫీజులు చెల్లించాలంటూ కాలేజీల నుంచి తీవ్రమైన ఒత్తిడితో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఫీజులు కట్టలేదని కొన్ని కాలేజీలు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ఇబ్బందులకి గురిచేస్తున్నాయి. కేంద్రం ఎస్సీ, ఎస్టీల విద్యార్థులకి ఇస్తున్న 60 శాతం ఫీజు ఏ లెక్కలోనా చూపకుండా మీరే విద్యాదీవెన ఇస్తున్నట్టు చేస్తున్న ప్రచారం ప్రజల్ని మోసగించడమే.
కొత్తగా విద్యా దీవెన డబ్బులను విద్యార్ధి, వాళ్ల తల్లి జాయింట్ అక్కౌంటులో వేస్తామంటూ మెలిక పెట్టడం విద్యార్థుల్ని మరింత ఇబ్బందులు గురిచేసే ప్రహసనం. విద్యాదీవెన, వసతి దీవెన అంటూ పేర్లు పెట్టి, విపరీతంగా ప్రచారం చేసుకోవడం తప్పించి..జరిగిన మేలు శూన్యం. మొండివైఖరి, ప్రచారార్భాటాలు మాని అర్జంటుగా ఫీజు రీయింబర్స్మెంట్ పాత బకాయిలు, ప్రస్తుత విద్యాసంవత్సరం ఫీజులు చెల్లించాలని కోరుతున్నాను’’ అని నారా లోకేశ్ లేఖలో రాశారు.