Nara Lokesh Yuvagalam Reached 2500 KM Mark: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర మరో మైలు రాయిని చేరుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో సీఎం జగన్ ఇంటి సమీపంలో లోకేష్ పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే, ఏం చేస్తుందనే హామీలతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లని క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తానని హామీ ఇస్తూ శిలాఫలకం ఏర్పాటు చేశారు. 


మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న ఇళ్లు లేని నిరుపేదలకు 20 వేల ఇళ్లు నిర్మిస్తాననే హామీతో లోకేశ్‌ శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి అయింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు లోకేష్ కు వీడ్కోలు పలికారు. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా పాదయాత్ర కొనసాగించారు. టీడీపీ శ్రేణులతో ప్రకాశం బారేజ్ పసుపుమయంగా మారింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర జనప్రభంజనం కనిపించింది.


భారీగా తరలి వచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు, జనసంద్రంగా మారాయి. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు. బాణాసంచా మోతలు, నినాదాలతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు హోరెత్తాయి. భారీ గజమాలలు, పూలవర్షంతో యువనేతను అభిమానులు ముంచెత్తారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్‌ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. 






చిత్తూరు జిల్లా కుప్పం నుంచి జనవరి 27న లోకేష్ 'యువగళం' పాదయాత్ర తొలి అడుగు పడింది. ఫిబ్రవరి 6 తేదీ 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ చిన తిమ్మసముద్రం-2 వద్ద మార్చి 9న 500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఏప్రిల్ 21న కర్నూలు జిల్లాలోని ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద వెయ్యి కిలో మీటర్ల మైలు రాయిని లోకేష్ దాటారు. కేవలం 77వ రోజుల్లో లోకేష్ వెయ్యి కిలోమీటర్లు నడిచారు.


కడపలో జూన్ 6వ తేదీ లోకేష్ 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కడపలో మెరుగైన డ్రైనేజి వ్యవస్థకు అలంఖాన్ పల్లె శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. జులై 11న కావలి నియోజకవర్గంలో 153వ రోజు లోకేష్ 2000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. తాజాగా ఆగస్టు 19న 2500 కిలోమీటర్ల మైలు రాయిని దాటి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో లోకేష్ అధికార వైసీపీపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అలాగే వైసీపీ నేతల అవినీతిని నిలదీస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్నివిధాలుగా వెనకబడిందని విమర్శలు చేస్తున్నారు.


2500 కిలోమీటర్ల పాదయాత్ర సాగిందిలా..



  • 2023 జనవరి 27 పాదయాత్ర ప్రారంభం

  • ఫిబ్రవరి 6న  పూతలపట్టు నియోజకవర్గం 100 కిలోమీటర్లు

  • మార్చి 9 మదనపల్లె నియోజకవర్గం 500 కిలోమీటర్లు

  • ఏప్రిల్ 21 ఆదోని నియోజకవర్గం 1000 కిలోమీటర్లు

  • జూన్ 6 కడప నియోజకవర్గం 1500 కిలోమీటర్లు

  • జులై 11 కావలి నియోజకవర్గం 2000 కిలోమీటర్లు

  • ఆగస్టు 19 మంగళగిరి నియోజకవర్గం 2500 కిలోమీటర్లు