Nara Lokesh Challenges Jagan | అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసానికి సమీపం నుంచి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఛాలెంజ్ చేశారు. తాడేపల్లిలోని జగన్ ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉండి మాట్లాడుతున్నానని, గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం తాము కాదన్నారు. ఏపీ మెగా డీఎస్సీ (DSC) నిర్వహణ, టీచర్ పోస్టుల నియామకాలపై ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానాలున్నా, వాటికి సమాధానం చెప్పేందుకు తానే స్వయంగా సిద్ధంగా ఉన్నానని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Continues below advertisement

జగన్ ఎన్ని జన్మలెత్తినా ఏపీలో డీఎస్సీ నియామకాలను ఆపలేరని నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలా 'సాక్షి క్యాలెండర్' కాకుండా, తాము నిరుద్యోగుల కోసం నిజమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నామని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించి ఉంటే వారికి హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియపై అవగాహన ఉండేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

పులివెందుల ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం జగన్.. బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ లూప్‌ను వీడి, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తేనే ఇక్కడి అభివృద్ధి కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఎప్పుడూ రౌడీల మధ్య ఉండే వైసీపీ అధినేత జగన్, మహిళలను కించపరిచే వారిని, తిట్టే వారిని తన చుట్టూ పెట్టుకుంటారని విమర్శించారు. గత ప్రభుత్వంలో కోడిగుడ్డుకు, పరిశ్రమకు తేడా తెలియని వాళ్లు మంత్రులుగా చేయడం వల్లే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయంటూ నారా లోకేష్ ధ్వజమెత్తారు.

Continues below advertisement

Also Read: AP Delimitation 2026: ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?

అమర్నాథ్‌పై జగన్ ప్రశంసలు దురదృష్టకరం..మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రెస్‌మీట్‌పై జగన్ ప్రశంసలు కురిపించడం దురదృష్టకరమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ వైసీపీ నేతలు హోం మంత్రి వంగలపూడ అనితని అవమానించినట్లే, జగన్ భార్య భారతీరెడ్డిని లేదా ఆయన ఇద్దరు కుమార్తెలను ఎవరైనా అవమానిస్తే జగన్ ఇలాగే శభాష్ అంటారా? అని నిలదీశారు. టీడీపీ పార్టీకి అలాంటి నీచమైన సంస్కృతి లేదని, అందుకే జగన్ కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో కించపరిచిన వారిపై కూడా తాము చర్యలు తీసుకున్నామని నారా లోకేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

‘మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినందుకు చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడి నుంచే నెగ్గాలని భావించాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో పోరాడి ఇదే సీటు తీసుకున్నాను. ఏపీలో టాప్ 3 మెజారిటీ నియోజకవర్గాల్లో ఒకటిగా మంగళగిరి నిలిచింది. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తెరిచి తక్కువ ధరకు పేదల ఆకలి తీర్చుతున్నాం. అనాడు  అన్న ఎన్టీఆర్ స్థాపించిన లైబ్రరీని అభివృద్ధి చేస్తున్నాం. చిన్న కార్పొరేషన్లో భూగర్భ డ్రైనేజీని తీసుకురావడంలో ఎంపీ కృషి ఉంది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం ముందుండేలా కృషి చేస్తానన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4 వేల ఫించన్, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. తల్లికి వందనంతో ఎంత మంది పిల్లలున్నా వారికి ఆర్థిక సాయం. అన్నదాతలకు కేంద్రం, రాష్ట్రం కలిపి 20 వేలు ఏడాదికి ఇస్తున్నాం. SIR ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలు వద్దన్నారు. కొత్తగా ఓట్లు నమోదు చేసుకోవాలని కొత్త వారికి సైతం సూచిస్తున్నామని’ అన్నారు.