Andhra Pradesh Weather: తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బుధవారంతోపాటు మరికొన్ని రోజులు ఉండే వాతావరణంపై విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కీలక ప్రకటన విడుదల చేశారు. ద్రోణి ప్రభావంతో బుధవారం పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు వెల్లడించారు.
బుధవారం(17-06-26) విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.
ఎండ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు.
