టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య గతంలో జరిగిన భేటీలు, తాజాగా నిన్న (ఏప్రిల్ 29) సమావేశం కావడంపై జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. భవిష్యత్తులో కూడా టీడీపీ చీఫ్ చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వైఎస్ఆర్ సీపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఒకే వేదికపైకి తేవడానికి వీరు సమావేశం అయ్యారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది తమ లక్ష్యమని నాదెండ్ల మరోసారి చెప్పారు. ఆదివారం (ఏప్రిల్ 30) అమరావతిలోని పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. 


వైఎస్ఆర్ సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారని అన్నారు. ఇందులో భాగంగానే నిన్న హైదరాబాద్ లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారని చెప్పారు. ఇప్పటికిప్పుడు పదవులు పంచుకోవడంపై ఏమీ మాట్లాడుకోవడం లేదని, కేవలం వైఎస్ఆర్ సీపీని గద్దె దింపడమే తమ తొలి ప్రాధాన్యం అని అన్నారు. 


రాబోయే ఎన్నికలకు పవన్‌ సిద్ధమవుతున్నారని చెప్పారు. అందులో భాగంగానే చంద్రబాబుతో చర్చలు జరిపారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తాము పదవుల కోసం కాదని, ప్రజల కోసం పని చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో మరికొన్ని సమావేశాలు జరుగుతాయని, అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. సీఎం జగన్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎక్కడ కాపురం పెడితే అక్కదే పాలన అని సీఎం జగన్ ప్రకటించడాన్ని నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు.