MLA Kethireddy Venkatrami Reddy: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా ధర్మవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అక్కడి ఎర్రగుట్ట ప్రాంతాన్ని ఆక్రమించి ఫాంహౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ పేరుతో పట్టణంలో పర్యటిస్తూ.. అందరూ నిజాయతీగా ఉండాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి నీతులు చెబుతారని ఎద్దేవా చేశారు. కానీ, ఆయన మాత్రం గుట్టలను దోచేస్తున్నారని లోకేశ్ విమర్శించారు.
అయితే, లోకేశ్ చేసిన ఈ విమర్శలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోమవారం (ఏప్రిల్ 3) సీఎం జగన్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధుల సమీక్షా సమావేశానికి హాజరు కావడానికి ముందు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సమీపంలో రోడ్డుపై ఆగి.. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫేస్ బుక్ లైవ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుండి తప్పుకుంటారా? అని సవాలు విసిరారు.
తాను కట్టించుకున్న ఫామ్ హౌస్ ఉన్న స్థలం మొత్తం రైతుల వద్ద నుంచి తాను కొనుక్కున్నానని చెప్పారు. చంద్రబాబు అక్రమంగా లింగమనేని నిర్మించిన ఫాంహౌస్‌లో నివాసం ఉంటున్నారని, అది క్రిష్ణా నది ఒడ్డున నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఆరోపించారు. చంద్రబాబు నివాసాన్ని చూపిస్తూ ఇది అక్రమ కట్టడం కాదా అంటూ ప్రశ్నించారు. ‘‘నేను రైతుల వద్ద భూములు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నా, చంద్రబాబులా రైతులను బెదిరించి నది వెంబడి భూములు లాక్కుని ఫామ్ హౌస్ లు నిర్మించలేదు’’ అని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడారు.
Nara Lokesh: నారా లోకేశ్ చేసిన ట్వీట్ ఇదీ
‘‘గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారు. అయితే తాను మాత్రం గుట్టలను దోచేస్తాడు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు. 902, 909 సర్వే నెంబర్లలోని 20 ఎకరాలను అక్రమించాడు. ఇది మరో రుషికొండ అని,ఎమ్మెల్యే గారి విలాస కార్యక్రమాలకు అడ్డా అని లోకల్ టాక్’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇప్పుడే కాదు, గతంలోనూ ఎమ్మెల్యే కేతిరెడ్డి నిర్మించుకున్న ఫామ్ హౌస్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. టీడీపీ, బీజేపీ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఆ సందర్భంలో కేతిరెడ్డి వాటిపై ఘాటుగా స్పందించేవారు. దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. మొత్తానికి లోకేష్ కారణంగా.. ఇప్పుడు కేతిరెడ్డి ఫామ్ హౌస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కేతిరెడ్డి గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి బోటింగ్ చేసిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే, ఆయనకు ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఇష్టమని, అందుకే ఎంతో ప్రేమతో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని కేతిరెడ్డి వర్గాలు చెబుతున్నారు.