ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవంపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. 2014లో 23 మందిని కొన్నందుకే 2019లో 23 వచ్చాయని, ఇప్పుడు ఇద్దర్ని కొన్నందుకు వచ్చే ఎన్నికల్లో ఆ రెండు కూడా రావని రోజా జోస్యం చెప్పారు. జగన్‌ను ఎవరు వ్యతిరేకించినా వారికే నష్టమని మంత్రి రోజా అన్నారు. జగన్‌కు సొంత అజెండా, జెండా ఉందని ఆమె పేర్కొన్నారు. అధికారంలో ఉండగా 23మందిని కొన్నారు కాబట్టే చంద్రబాబు 23సీట్లకు పరిమితం అయ్యారని అన్నారు. ఇప్పుడు ఇద్దరిని కొన్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆ రెండు స్థానాలు కూడా దక్కవని రోజా కామెంట్ చేశారు. చంద్రబాబు చేసే నీచ రాజకీయాలకు భవిష్యత్‌లో ఆయనకే అవి తిరుగబడతాయన్నారు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నం ఫలించదని, వచ్చే ఎన్నికల్లో ప్రజంతా ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని గెలిపించేందుకు ఫిక్స్ అయ్యారని అన్నారు.


మాకేం నష్టం లేదు: మంత్రి కాకాణి 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్పందించారు. ఒకరిద్దరు ఓటు వేయకుండా మోసం చేసినంత మాత్రాన జగన్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం లేదని మంత్రి కాకాణి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కి వ్యతిరేక ఓటు వేయటం పార్టీ అంతర్గత సమస్యని ఆయన వ్యాఖ్యానించారు. వ్యతిరేక ఓటు వేసిన వారిపై చర్యలుంటాయని తెలిపారు. క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత సమావేశాల్లో విశ్లేషణ చేసి ముందుకు వెళ్తామని అన్నారు. సంఖ్యా బలం ప్రకారం 7 స్థానాల్లో పోటీ చేశామని వెల్లడించారు. చంద్రబాబు చేసుకునే చివరి విజయోత్సవాలు ఇవేనని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు. 2024 చంద్రబాబు చివరి ఎన్నికలని, ప్రజల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగినపుడు టీడీపీ విషయం బయటపడుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఉండదని కేవలం ప్రజలకు ఒక ఓటు మాత్రమే ఉంటుందని అన్నారు. ఈ ఫలితాలపై ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్నారు. 2024లో వైసీపీ ఘన విజయం సాధించి జగన్ మళ్ళీ సీఎం అవుతారని స్పష్టం చేశారు.


చంద్రబాబే సమాదానం చెప్పాలి: సజ్జల


జరిగిన దానికి చంద్రబాబే సంజాయిషీ ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోటీలో దిగాం కాబట్టి ప్రయత్నం చేశామని, పిలిచి మాట్లాడాం కూడా అని చెప్పారు. తమ వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశామని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ డబ్బు పని చేసినప్పుడు దాని మీద సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని, చంద్రబాబే సంజాయిషీ ఇవ్వాలని సజ్జల అన్నారు.  ఏ నమ్మకంతో ఆ ఇద్దరు తెలుగు దేశానికి ఓటు వేశారో అందరికి తెలుసని అందుకు బలమైన కారణం డబ్బేననిన సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడికు శాశ్వతంగా 23 స్థానాలు రావని ఆయనే ఒప్పుకుంటున్నారని 23 వారికి అచ్చొచ్చిన ఫిగర్‌ అయితే ఆయన్ని కంగ్రాట్స్‌ చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు జగన్‌ చేపట్టిన సంస్కరణలు అందుకుంటున్నారని, కాబట్టి 175కు 175 గెలుస్తాం అన్న నమ్మకంతో ఉన్నామన్నారు. దానికి దీనికి అసలు సంబంధం లేదని ఆయన అన్నారు.


175 స్థానాలకి పోటీ చేయలేరు...


చంద్రబాబు 175 స్థానాల్లో ఎందుకు పోటీ చేయలేకున్నారో స్పష్టం చేయాలని సజ్జల డిమాండ్ చేశారు. నిజంగా చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలను చూసి బలపడ్డామనుకుంటే 175కు ఎందుకు పోటీ చేయలేకుపోతున్నారో స్పష్టం చేయాలన్నారు. ఏ పార్టీ అయినా వారి విధానాలు వారి మేనిఫెస్టోలో స్పష్టంగా చెబుతారని అడ్డదారులు తొక్కి ఓట్లు వేయమనడం కరెక్టా అని సజ్జల అన్నారు.