వాల్తేర్ వీరయ్య రెండు వందల రోజులు ఆడడం సంతోషంగా ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఒకప్పుడు తాను కూడా అభిమానిని అని, అప్పట్లో చిరంజీవి కటౌట్లకు తాను ఒక ఫ్యాన్‌గా దండలు వేశానని గుర్తు చేశారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. తాడేపల్లిలో మంత్రి పేర్ని నాని మంగళవారం (ఆగస్టు 8) విలేకరుల సమావేశం నిర్వహించారు. చిరంజీవి సినిమాని సినిమాగా.. రాజకీయాల్ని రాజకీయంగా చూడాలని పేర్ని నాని అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి ఏపీ సచివాలయానికి ఎంత దూరమో.. ఏపీ సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్‌కి అంతే దూరమని అన్నారు. 


ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పటి వరకు సినిమా హీరోలపై మాట్లాడిందా అని అడిగారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, రాం చరణ్ మీద ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. వారి రెమ్యునరేషన్‌ గురించి ఎవరైనా అడిగారా అని అన్నారు. ‘‘ఒక మంత్రిపై కక్షతో సినిమాలో పాత్రలు పెట్టారు. మరి విమర్శలు ఎదుర్కోక తప్పదు. గిల్లితే గిల్లించుకోవాలి అని సినిమాలో చెప్పినట్టు ఉండదు. బాహ్య ప్రంపంచంలో గిల్లినపుడు గిల్లుతారు. ఇది సినిమా కాదు. సినిమాలో మంత్రి పాత్ర పెట్టారు కాబట్టి  ఇలా కామెంట్స్ వస్తున్నాయి’’ అని పేర్ని నాని అన్నారు.