Botsa Comments on 3 Capitals: ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు వాడివేడిగా ముగిశాయి. గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే సభలో టీడీపీ సభ్యులు గవర్నర్ గో బ్యాక్.. గోబ్యాక్ అంటూ అడ్డు తగిలారు. రాజ్యాంగాన్ని పరిరక్షించలేని గవర్నర్ ఎందుకంటూ పోడియం వద్దకు వచ్చి ప్రసంగం ప్రతులను చింపి పైకి ఎగరేశారు. అనంతరం వారు వాకౌట్ చేశారు. సభ వాయిదా అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలకు ఆవేశం ఎక్కువని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఎప్పుడు ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోరని విమర్శించారు.
మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘శాసనసభ చట్టాలను చేయొద్దంటే ఎలా కుదురుతుంది. రాజ్యాంగానికి లోబడే ఏ వ్యవస్థ అయినా పని చేయాలి. హైకోర్టు అనలేదు. పునర్విభజన చట్టం ప్రకారం.. 2024 వరకు మన రాజధాని హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే, రాజధానిని మేం గుర్తించిన తర్వాత పార్లమెంట్‌కు పంపి అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవు. మా ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే’’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.
శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రధాన సూచన ప్రకారమే తాము రాజధానుల వికేంద్రీకరణ చేపట్టామని బొత్స అన్నారు. రాజధాని విషయంలో కోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలా వద్దా అనేది బీఏసీలో నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు. శాసనసభలు, పార్లమెంటు ఉన్నదే చట్టాలు చేయడానికని.. చట్టాలు చేసే అధికారం చట్టసభలకు లేదని కోర్టు చెప్పలేదని అన్నారు. కోర్టు కేవలం సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేసే అంశంపైనే వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు.
‘‘క్షణికావేశంలో టీడీపీ సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ ఏదో ఉద్ధరించాలని, రాజకీయ సానుభూతితో అసెంబ్లీకి వచ్చారు. స్వార్థం కోసం తప్ప వాళ్లు ప్రజా ప్రయోజనాలు, సమష్టి నిర్ణయాలు, అభిప్రాయాలు ఆ పార్టీ నేతలకు లేవు. క్షణికావేశంలో తీసుకునే ఏ ఆలోచనలనూ ప్రజలు ఆమోదించరు. విశాలమైన ఆలోచనలు, దూర దృష్టితో తీసుకునే నిర్ణయాలను మాత్రమే ప్రజలు ఆమోదిస్తారు’’ అని టీడీపీ నేతలపై బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read: TDP Atchannaidu: ఏపీ రాజధాని హైదరాబాద్, మంత్రి బొత్స కామెంట్స్ పై అచ్చెన్నాయుడు ఫైర్