MLA Alla Ramakrishna Reddy joined in YSRCP: గతేడాది చివర్లో వైసీపీ నుంచి వైదొలిగి, అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మళ్లీ పార్టీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేను పార్టీకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి వైసీపీలోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మంగళవారం ఆళ్ల.. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత తన సన్నిహితులతో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ని తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని.. అది తనకు నచ్చలేదని అన్నారు. జగన్ తనను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారని అన్నారు. కాంగ్రెస్ లో పద్ధతి పాడు ఏమి లేదని అన్నారు. ‘‘రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలి.. కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల విధానం అలా లేదు కేవలం వ్యక్తిగతంగానే ఉంటుంది. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆమెతో పాటు పార్టీకి చెప్పి చూసాను కానీ వినలేదు. జగన్ పై వ్యక్తిగతంగా వెళ్లడం నాకు నచ్చలేదు అందుకే ఆమెతో నడవడం ఇష్టం లేక సొంత గూటికి వస్తున్నా’’ అని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సన్నిహితులతో అన్నట్లు తెలిసింది.
మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలబెట్టినా గెలిపిస్తా - ఆర్కే
‘‘వైఎస్‌ఆర్ సీపీ నాకు అన్ని రకాల అండగా ఉంది. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చిన పార్టీ. ఏది ఏమైనా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి బీసీ సామాజికవర్గం నుంచే. వైసీపీ అంటే అభిమానం కాబట్టే తిరిగి వైసీపీలోకి వచ్చాను. రెండు నెలలు పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చింది. 2019లో ఏవిధంగా ఓ ఓసి వర్గం చేతిలో ఓటమి చెందాడో అదే విధంగా 2024 ఎన్నికల్లో కూడా లోకేష్ బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి తథ్యం. పేదలకు మంచి జరగకూడదన్నదే విపక్షాల ప్రయత్నం. విపక్షాల ప్రయత్నం ఫలించకూడదనే తిరిగి వైసీపీలో చేరాను.
మంగళగిరిలో వైసిపి అభ్యర్థిగాఎవరిని బరిలో నిలబెట్టినా గెలిపిస్తా. రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తున్న వ్యక్తి జగన్. మరోసారి మంగళగిరిలో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓటమి ఖాయం. మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఏవరనేది అధిష్టానం చూసుకుంటుంది’’ ఆర్కే అన్నారు.