మాచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కు టీడీపీ నేతలు లేఖ ద్వారా పిర్యాదు చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ మేరకు కమిషన్ కు లేఖ ద్వారా వివరాలను అందించారు.
మాచర్ల ఘటనపై స్పందించండి... టీడీపీ లేఖ
మాచర్ల ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, టీడీపీ నేత వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ వైసీపీతో కొంత మంది పోలీసులు కుమ్మక్కవడంతో రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నారని, ఇందుకు మాచర్ల ఘటనే నిలువెత్తు నిదర్శనమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి తన ప్రైవేటు గూండాలతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యుల ఇళ్లపై దండెత్తి మహిళలు, పిల్లలు అని తారతమ్యం లేకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఇళ్లను తగులబెట్టారని వర్ల రామయ్య మానవ హక్కుల కమిషన్‌కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి చేస్తున్న శాంతియుత ర్యాలీపై దాడి చేయడంతో వైసీపీ నేతలు దుర్మార్గాలకు ఒడిగట్టారని తెలిపారు.


ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోని విలువైన ఆభరణాలు సైతం దొంగిలించుకుపోయారని, దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ ఘోర కలిని చూస్తూ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని ఆరోపించారు. పోలీసులు కార్డన్ సర్చ్ చేసిన తర్వాత కూడా వైసీపీ గూండాలు ప్రతి పక్ష నేతలపై మారణాయుధాలతో దాడి చేయడం వెనుక పోలీసుల సహకారం లేదనేందుకు ఆస్కారం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసి మాచర్ల టౌన్ వదిలి వెళ్లాలని ఆదేశించారని, గత కొన్ని నెలలుగా ప్రజలు మాచర్లను వదిలి బయటకు పోయే పరిస్థితులే నెలకొన్నాయన్నారు.
మాచర్లలో ప్రైవేట్ గూండాలు...
మాచర్లలో అధికార పార్టీ నాయకుల ప్రైవేటు గూండాలు 16 మందిని హత్య చేసినా పోలీసులు హంతకులను అరెస్టు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మాచర్ల ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నివాసాలు విడిచిపెట్టి జిల్లా హెడ్ క్వార్టర్ గుంటూరులో తలదాచుకున్న రోజులు ఇంకా మరిచిపోలేదన్నారు. మాచర్ల ప్రాంతంలో శాంతిభద్రతల క్షీణించడానికి పోలీసు డిపార్ట్ మెంటులోని కొంతమంది ఉన్నతాధికారులే కారణమని లేఖలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, ఎస్పీ రవిశంకర్ రెడ్డిలు అధికార పార్టీ నేతల కోసం శాంతిభద్రతలను పణంగా పెట్టారని, మాచర్ల ఘటనపై, పోలీసుల పాత్రపై నిష్పాక్షికంగా విచారణ జరిపి దోషులకు శిక్షపడేలా చూడాలని వర్ల రామయ్య జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ను కోరారు. రాజ్యాంగపరమైన తమ విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
నిరంతరం పోరాటాలు చేస్తాం..
మాచర్లలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ టీడీపీ నేతలు, కార్యకర్తలతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. పోలీసుల అండతో తమపై, తమ ఇళ్లపై జరిగిన దాడులను బాధితులు చంద్రబాబుకు వివరించారు. ఇళ్లు, కార్లు ధ్వంసం చేసిన విధానాన్ని వివరించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. నష్టపోయిన కుటుంబాలను పార్టీ ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఓ పక్క దాడులతో తీవ్ర ఆవేదనలో ఉన్న బాధిత వర్గంపైనే పోలీసులు అక్రమ కేసులు పెట్టిన విధానాన్ని జిల్లా నేతలు అధినేతకు వివరించారు. 24 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్లు చంద్రబాబుకు తెలిపారు. కేసుల విషయం కూడా పార్టీ చూసుకుంటుందని... చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కేవలం పార్టీ నేతలను అక్రమ కేసుల నుంచి బయటపేడయటంతో పాటు దాడులకు కారకులపై చర్యలు తీసుకునేవరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు చంద్రబాబు. మాచర్ల ఘటన ముమ్మాటికి ప్రభుత్వ హింసే అని, ప్రణాళిక ప్రకారం జరిగిన దాడులకు జిల్లా ఎస్పీ సహకరించారని చంద్రబాబు అన్నారు.