Andhra Pradesh LRS | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణ (LRS)కు ప్రభుత్వం ఇటీవల అవకాశం ఇచ్చింది. ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి కేవలం 4 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఈ గడువు ఈ నెల 23తో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 వేల ఎకరాల్లో అనధికార లేఔట్లు ఉండగా, ఇప్పటివరకు 6 వేల ఎకరాలకు సంబంధించి 52,470 దరఖాస్తులు అందాయి. ఇంకా 25 వేల దరఖాస్తులు రావాల్సి ఉంది. గడువు పెంచాలని ప్రజల నుంచి వినతులు వస్తున్నా, పురపాలక శాఖ దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. గతంలో అక్రమంగా వెలిసిన లేఔట్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సుమారు 75 వేల మందికి లబ్ధి చేకూరడంతో పాటు ప్రభుత్వానికి రూ.600 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు.
ఎల్‌ఆర్ఎస్ రాయితీలు, నిబంధనలు
ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకునే వారికి 'ఓపెన్ స్పేస్ ఛార్జీల'లో ఏపీ ప్రభుత్వం 50% రాయితీ కల్పిస్తోంది. అంటే ప్లాట్ విలువలో 14 శాతానికి బదులు కేవలం 7 శాతం చెల్లిస్తే చాలు. ఒకవేళ ఈ గడువు ముగిసిన తర్వాత క్రమబద్ధీకరణ చేసుకోవాలంటే పూర్తి స్థాయిలో 14 శాతం ఛార్జీలతో పాటు, రిజిస్ట్రేషన్ విలువలపై ఆలస్య లేదా జరిమానా రుసుములు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఆ లేఔట్‌లో కనీసం కొన్ని ప్లాట్లయినా ఎల్‌ఆర్‌ఎస్ పొంది ఉంటేనే భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. లేదంటే ఆ లేఔట్‌ను శాశ్వతంగా అనధికారికమైనదిగానే పరిగణిస్తారు.
అమలులో ఎదురవుతున్న సవాళ్లు
ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో అధికారులకు ప్లాట్ల యజమానులను గుర్తించడం పెద్ద సవాలుగా మారింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్లు పని చేయకపోవడం, ఆ తరువాత కాలంలో వారి ఇంటి చిరునామాలు మారడంతో యజమానులను సంప్రదించడం అధికారులకు కష్టమవుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, చిత్తూరు లాంటి పట్టణాల శివార్లలోని లేఔట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకూ వచ్చిన LRS దరఖాస్తుల్లో కూడా 9,245 దరఖాస్తులు అసంపూర్తి సమాచారంతో ఉన్నందున వాటిని పరిష్కరించడం సమస్యగా మారుతోంది.