అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తన ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం దాదాపు 9 గంటల ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం ఏడున్నర గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సతీమణి భువనేశ్వరి, కుమారుడు ఏపీ మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్సులతో కలిసి వెలగపూడి బయలుదేరారు. శుభ ముహూర్తాన వెలగపూడిలో నిర్మించనున్న ఇంటికి శంకుస్థాపన చేశారు.

రాజధాని పరిధిలో ఇల్లు కట్టుకుంటానని చంద్రబాబు గతంలోనూ చెప్పారు. 2024 డిసెంబర్లో వెలగపూడి పరిధిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో భూమిని గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి కొనుగోలు చేశారు. తమ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇల్లు నిర్మించుకుంటున్నందుకు వెలగపూడి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. వారు సీఎం కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు అందజేయనున్నారని సమాచారం. భూమికి సంబంధించి ప్లాట్ రిజిస్ట్రేషన్ సైతం పోతాయి. ఇంటి నిర్మాణం భూమి పూజ, శంకుస్థాపన ఉన్నందున గత వారం నుంచి అక్కడ భూమి చదును చేసే పనులు చేశారు. 

మొత్తం 1455 చదరపు గజాల విస్తీర్ణంలో సీఎం చంద్రబాబు వెలగపూడిలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. జీ ప్లస్ వన్ లో ఇంటి నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం. ఎస్.ఆర్.ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఏడాదిలోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఈ మేరకు కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఇంటి నిర్మాణంపై పలు సూచనలు చేశారు. కంటి ఆవరణలో పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ మొక్కలు ఎక్కువగా పెంచాలని చంద్రబాబు నిర్ణయించారు.