CM Jagan: డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, ఆమె తల్లిదండ్రులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న తమ కూతురుకు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చేయడం వల్లే ఈరోజు పాప ఆరోగ్యంగా ఉందని చెప్పారు. గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ ను... చిన్నారి హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు కలిశారు. తమ కూతురు ఆరోగ్య పరిస్థితి గురించి వివరించి సాయం చేయమని కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. చిన్నారి హనీ చికిత్స కోసం ఇప్పటికే రూ.1 కోటి మంజూరు చేశారు. హనీ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు రూ.10 వేలు పెన్షన్‌ కూడా ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో వైద్యులు బాలికకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. దీంతో బాలిక ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంది.






నేడు (జనవరి 11) పాప హనీ పుట్టిన రోజు కావడంతో ఆమె తల్లిదండ్రులు పాపను తీసుకొని తాడేపల్లికి వచ్చి సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మీ వల్లే మా పాప ఈరోజు ఆనందంగా పుట్టిన రోజు జరుపుకుంటుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. మీ మేలును జీవితాంతం మర్చిపోలేమంటూ సీఎం జగన్ కు తెలిపారు. ఈ క్రమంలోనే చిన్నారి హనీ పట్టిన రోజు సందర్భంగా.. నువ్వు ఇలాగే హాయిగా నూరేళ్లు బతకాలంటూ హనీని సీఎం జగన్ ఆశీర్వదించారు. 


పుట్టుకతోనే గాకర్స్ బారిన పడిన చిన్నారి..


డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కారామేశ్వరానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతుల రెండున్నర సంవత్సరాల చిన్నారి హనీ అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి చికిత్స చెయ్యించేందుకు ఆ కుటుంబానికి అంత ఆర్థిక స్థోమతలేదు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ. కోటి  బడ్జెట్ కేటాయించారని కలెక్టర్ తెలిపారు. చిన్నారి హనీకు పుట్టుకతో ఈ వ్యాధి వచ్చిందని ఈ వ్యాధిమూలంగా లివర్ పనిచేయదని జిల్లా కలెక్టర్  హిమాన్ష్ శుక్లా తెలిపారు. 


13 ఇంజెక్షన్లు అందజేత 


స్థానిక ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరఫున  ఉచితంగా 13 ఇంజెక్షన్లను చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. ఇటీవల గోదావరి వరదలు మూలంగా వరద ప్రాంతాల సందర్శనకు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఆ దంపతులు ప్లకార్డు ప్రదర్శించారు. కాన్వాయ్ ఆపి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ దంపతులను పిలిచి పాప అనారోగ్యంపై సమాచారం తెలుసుకున్నారు. సీఎం వెంటనే స్పందించి అక్కడికక్కడే ప్రభుత్వ ఉన్నతాధికారులు, వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ను సంప్రదించి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఆ మేరకు కలెక్టర్  ప్రభుత్వానికి పాప వైద్యానికి సంబంధించి ప్రతిపాదనలు పంపారు. చిన్నారి హనీ వైద్యానికి ముఖ్యమంత్రి రూ. కోటి  బడ్జెట్ కేటాయించారని కలెక్టర్ తెలిపారు.


ఈ గాకర్స్ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజెక్షన్లను మంజూరు చేసింది. ప్రస్తుతం 13 ఇంజెక్షన్లను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి పంపింది. ఇంజెక్షన్ ఖరీదు రూ 1,25,000 రాయితీతో రూ.74,000 లకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఉచితంగా బాధితులకు అందిస్తుంది. ఈ ఇంజెక్షన్ అమెరికాలో తయారవుతుందని ఇప్పటివరకు రూ 10,08,000 విలువచేసే ఇంజెక్షన్లను ప్రభుత్వం ద్వారా ఉచితంగా సరఫరా చేశారని కలెక్టర్ తెలిపారు. ఈ ఇంజెక్షన్ 15 రోజులకు ఒకసారి రెగ్యులర్ గా పాపకి ఇవ్వాలని సూచించారు.