Minister Ambati Rambabu : ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది. వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అమ్మించి, డబ్బు వసూలు చేస్తున్నారని మంత్రి అంబటిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో జనసేన.. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టు పిల్ దాఖలు చేశారు. గాదె వెంకటేశ్వరరావు పిల్ ను మంగళవారం జిల్లా కోర్టును విచారించారు. మంత్రి రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు
వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో టికెట్లను బలవంతంగా విక్రయిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో మంత్రి అంబటిపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు జనసేన నేతల ఫిర్యాదుపై కేసు నమోదుకు నిరాకరించడంతో జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన జిల్లా కోర్టు తక్షణమే మంత్రి అంబటిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. గతంలోనూ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. కొడుకు చనిపోయే బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారంలో మంత్రి అంబటి వాటా అడిగారని ఆరోపించారు.
పరిహారంలో లంచం అడిగారని ఆరోపణలు
మంత్రి అంబటి రాంబాబుపై ఇటీవల జనసేన నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. బాధితులకు పరిహారం వస్తే అందులో సగం ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బాధితులకు ఐదు లక్షల పరిహారం చెక్కు వస్తే వాటిలో నుంచి తమకు రూ.2 లక్షల లంచం అంబటి అడగడం సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు. జనసేన నేతల ఆరోపణలపై స్పందించిన అంబటి రాంబాబు తాను ఎవరినైనా ఒక్క రూపాయి అడిగానని నిరూపిస్తే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సత్తెనపల్లి పట్టణంలో గత ఏడాది ఆగస్టు నెల 20వ తేదీన ఓ రెస్టారెంట్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయారు. వారిలో వడ్డెర కులానికి చెందిన తురకా అనిల్ కు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారం చెక్కు రూపంలో వచ్చింది. ఈ ఐదు లక్షల్లో నుంచి రెండున్నర లక్షల రూపాయలు తమకు ఇవ్వాలని సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్ భర్త సాంబశివరావు డిమాండ్ చేసినట్లుగా బాధితులు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి స్థానికంగా ఉన్న ఓ నేత సాయంతో మంత్రి అంబటి రాంబాబును కలిశామని బాధితులు చెప్పారు. అయితే మంత్రి కూడా తనకు రెండు లక్షలు ఇచ్చి తీరాల్సిందేనని చెప్పారని బాధితులు చెప్పారు. కొడుకు చనిపోయిన డబ్బులు వస్తే తమ కూతురు పెళ్లి చేసుకుందామనే ఆశతో తాము ఉన్నామని, తీరా మంత్రి పరిహారం డబ్బుల నుంచి కూడా లంచం అడిగారని బాధితులు వాపోయారు. బాధితులు మంత్రిపై చేసిన ఆరోపణల వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను జనసేన సైనికులు మరింత వైరల్ చేశారు.