ఏపీకి కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉన్న నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునే విధంగా పని చేస్తానని అన్నారు. పోలీసు వ్యవస్థలో ఏదైనా మారుమూల ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ తప్పు చేసినా మొత్తం పోలీసు వ్యవస్ పైనే ఆరోపణలు వస్తాయని ఆయన అన్నారు. మతాల మధ్య సామరస్యం ఉండాలని, చిన్న పొరపాటు కూడా జరగకుండా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. 


మరోవైపు, డీజీపీ పదవి నుంచి గౌతమ్ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీపీఎస్పీ ఛైర్మన్‌గా నియమించడాన్ని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా ఆమోదం తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. డీజీపీగా పదవి నుంచి దిగిపోతుండడంతో ఆయనకు గురువారం ఆరో బెటాలియన్‌ గ్రౌండ్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. కుటుంబ సమేతంగా గౌతమ్‌ సవాంగ్‌ వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు.


ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. తన 36 ఏళ్ల పోలీసు సర్వీసు నేటితో ముగుస్తోందని అన్నారు. డీజీపీగా 2 ఏళ్ల 8 నెలల కాలం పనిచేశానని అన్నారు. తన పదవి కాలంలో సీఎం ఇచ్చిన సూచనల ప్రకారం పని చేశానని అన్నారు. చాలా సంస్కరణలు, పోలీసు వ్యవహార శైలిలో మార్పులు తెచ్చేందుకు పని చేశానని అన్నారు. ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేసేందుకు ప్రయత్నించానని.. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు.