ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshmi Narayana) త్వరలోనే పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. బహిరంగంగా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుపై విమర్శలు చేయడమే దీనికి కారణం అంటున్నారు రాజకీయ వేత్తలు. క్రమశిక్షణకు పెద్ద పీట వేస్తామని చెప్పే బీజేపీలో ఇలాంటి ప్రవర్తనను సహించే అవకాశాలు తక్కువే కాబట్టి, అన్నిటికీ సిద్ధపడే కన్నా లక్ష్మీ నారాయణ ఈ స్టాండ్ తీసుకున్నట్టు బీజేపీ శ్రేణులు అంటున్నాయి.
పవన్ - చంద్రబాబు భేటీ బీజేపీలో పెట్టిన చిచ్చు
ఇటీవల విజయవాడలో అనూహ్య పరిస్థితుల్లో జరిగిన చంద్రబాబు (Chandrababu) - పవన్ కళ్యాణ్ ల (Pawan Kalyan) భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అయితే, ఆ భేటీకి కాస్త ముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీపై పోరాటంలో బీజేపీ నుండి సరైన మద్దతు లభించలేదని అసహనం వ్యక్తం చేశారు. దానితో కమలం పార్టీ నేతల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై స్పందిస్తూ కన్నా లక్ష్మీ నారాయణ జనసేన తో సమన్వయం చేసుకోవడంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విఫలం అయ్యారంటూ విమర్శలు గుప్పించారు. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో సోము వీర్రాజు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానానికి సమాచారం అందించారు. దానితో కన్నాపై చర్యలు తప్పవన్న చర్చ పార్టీలో మొదలైంది.
పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నాకే..!
అయితే, కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) తిరుగుబాటుపై ఆయన లెక్కలు ఆయన కున్నాయని అంటున్నారు ఆయన అభిమానులు. జనసేన-బీజేపీ పొత్తు ఏర్పడటంలో కీలక పాత్ర నాటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణదే. 2020 జనవరి 17 న " భేషరతు" గా జనసేన పొత్తు ఇచ్చేలా ఆయన ఒప్పించారు. అయితే2, ఆ తర్వాత కొద్ది కాలానికే పార్టీ అధ్యక్ష పదవిని కోల్పోయారు. అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్న కన్నా.. ఇప్పుడు అంది వచ్చిన అవకాశంతో పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషణలు వినవస్తున్నాయి. గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరుగులేని బలం గల నేతగా పేరున్న ఆయన ప్రస్తుత పరిణామాలు నేపథ్యంలో మరో పార్టీ వైవు చూస్తున్నారు అనే చర్చ మొదలైంది.
కన్నా చూపు.. టీడీపీ వైపేనా?
ప్రస్తుతం జనసేన - టీడీపీల మధ్య పొత్తు పొడవడం దాదాపు ఖాయమే అని సంకేతాలు బలంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో తన భవిష్యత్తు కోసం సరైన స్టెప్ తీసుకోవడానికి కన్నా లక్ష్మీ నారాయణ సిద్ధం అయిన సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ కూడా గుంటూరు ప్రాంతంలో ఒక బలమైన లీడర్ కోసం చూస్తుంది. దీనిని ఒక మంచి ఆవకాశంగా కన్నా చూస్తున్నారనీ.. వీలైతే టీడీపీ నుండి గుంటూరు ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారని ఊహాగానాలు బలంగా వినవస్తున్నాయి. అదే గనుక జరిగితే గుంటూరు ప్రాంత రాజకీయాలు మరింత రసవత్తరంగా మారినట్టే!