ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది. ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌ అంశం. నిన్నటి వరకు పవన్, చంద్రబాబు అంశంపై తీవ్రంగా చర్చ జరిగింది. ఇప్పుడు సడెన్‌గా బీజేపీలో అంతర్గత పోరుపై డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. పొత్తులపై క్లారిటి వస్తుందనుకుంటున్న టైంలో బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి. 


కన్నా కామెంట్స్‌ తర్వాత ఏపీ బీజేపీలో అంతర్మథనం మొదలైందనే ప్రచారం జరుగుతుంది. విజయవాడ కేంద్రంగా ఇటీవల జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో కూడ ఇదే విషయం పై నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారని చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సొము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలు కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు తెరతీశాయి. అధ్యక్షుడుగా ఉన్న సొము వీర్రాజు పవన్‌ను ఆశించిన స్థాయిలో ఉపయోగించలేకపోయారని అంటున్నారు. దీని వలన పవన్ కూడా రాజకీయంగా మరో పార్టీకి దగ్గర కావాల్సి వచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


లోపం ఎక్కడ ఉంది..


బీజేపి ఏపీ నాయకులు పార్టీని రాజకీయంగా ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళటంలో విఫలం అయ్యారనే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ఆ తరువాత పార్టీ పరంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల వ్యవహరంలో వ్యూహాలు అనుసరించలేకపోయారని పార్టీ లీడర్లే ఆఫ్‌ ది రికార్డు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా ఆందోళనలు నిరసనలు నిర్వహించకపోవటం, కరోనా తర్వాత పరిస్థితులు మార్పు వచ్చినా ఇంకా అదే ధోరణిలో పార్టీ వ్యవహారాలు ఉండటం కూడ కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని చెబుతున్నారు. జనసేనాని విషయంలో ఏపీ నాయకులు అంతగా టచ్‌లోకి వెళ్లకపోవటం కూడ మైనస్‌గా చెబుతున్నారు. 


పార్టీని ఏపీలో బలోపేతం చేసేందుకు కార్యచరణ, వ్యూహాలు మాట అటుంచితే, జనసేనానికి ఉన్న ఫాలోయింగ్‌ను బీజేపీకి కలసి వచ్చే అంశంగా ఎందుకు ఉపయోగించుకోలేదన్న ప్రశ్న వినిపిస్తోంది. సమకాలీన రాజకీయాలపై జనసేనానికి సమయం వచ్చినప్పుడల్లా సమావేశమై, రాజకీయంగా ఇరు పార్టీలు అనుసరించాల్సిన అంశాలపై చర్చించిన దాఖలాలు లేవు. దీంతో బీజేపీ, జనసేన నాయకులు ఎవరికి వారు విడివిడిగానే రాజకీయాలు చేసుకుంటున్నారు. బీజేపి అధ్యక్షుడు వీర్రాజు జనసేన అధినేత పవన్‌ను అవకాశం వచ్చినప్పుడల్లా కలుస్తూ ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఆందోళనలు నిర్వహించటం, లేదా ప్రెస్ మీట్‌లు పెట్టి కామెంట్స్ చేయటం వంటివి అసలు లేకపోవటం కూడా లోపంగానే చెబుతున్నారు.


బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు రాజకీయంగా అంత దూకుడుగా వెళ్లే మనస్థత్వం కాదన్నది పార్టీ నాయకుల అభిప్రాయం. ఇదే సమయంలో పవన్ కూడా వీర్రాజు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావటంతో, తరచు కలుస్తూ ఉంటే కులం రంగు పులిమేస్తారనే భావన కూడా లేకపోలేదని అంటున్నారు. ఇదే ఇబ్బందిగా మారి పవన్‌ను వీర్రాజు కొంత దూరంగా మెలిగారని అంటున్నారు. రాజకీయాల్లో కులాలు, వర్గాలు కామన్ కాబట్టి అలాంటి వాటిని పట్టించుకోకుండా అవకాశాలను యూజ్ చేసుకొని ఉంటే... బీజేపీ నుంచి పవన్ దూరం వెళ్లే వారు కాదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో లేకపోలేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబు,పవన్‌ను కలవటం పొత్తుల వ్యవహరంలో చర్చలకు తెరతీసినట్లైంది. ఇప్పుడు బీజేపి పరిస్థితి ఏంటి, కాషాయ దళం రూటెటు అనే ప్రశ్నాలు రాజకీయాల్లో తలెత్తాయి. అదే బీజేపీలో అంతర్గత పోరుకు కారణమైందని పార్టీ లీడర్లు చెబుతున్నారు.